వీఆర్ఏలు మరోసారి పోరాటానికి సిద్ధం కావాలి.
మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు
మెట్ పల్లి టౌన్, డిసెంబర్ 20,
జనంసాక్షి :
గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో కీలకపాత్ర వహించే వీఆర్ఏల డిమాండ్లను ప్రభుత్వం పక్కన పెట్టడం దారుణమని మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం రోజున మెట్పల్లిలోని స్థానిక విలేకరులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో వీఆర్ఏలందరూ తమ న్యాయమైన డిమాండ్ల కోసం మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఎలక్షన్ అనంతరం వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, తీరా వీఆర్ఏలు విధుల్లోకి చేరిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయి వారికి తీరని అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనడానికి వీఆర్ఏల పట్ల ప్రభుత్వానికున్న చిన్న చూపే నిదర్శనమని అన్నారు. వీఆర్ఏలు ప్రభుత్వ నిబంధనల మేరకు విధులు నిర్వర్తించే కష్టజీవులని, ఇప్పటికైనా ప్రభుత్వం సమస్య పరిష్కరించడంలో కాలయాపన చేయకుండా మానవత దృక్పథంతో సత్వర పరిష్కారానికి చొరవ చూపాలని లేనిచో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలను లేవదీసి హైదరాబాదులో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నిలదీస్తామని హెచ్చరించారు.
వీఆర్ఏలు మరోసారి పోరాటానికి సిద్ధం కావాలి




