Wednesday, 4 November 2026

వీఆర్ఏ ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత.

 

 

 

 

 

 

 

 

– వీఆర్ఏ యూనియన్ జిల్లా కన్వీనర్ దుర్గం శ్రీనివాస్.బెల్లంపల్లి, ఫిబ్రవరి 8, (జనంసాక్షి )
కామారెడ్డి జిల్లా అంచనుర్ గ్రామ వీఆర్ఏ మన్నే దేవరజ్ ఆత్మ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వీఆర్ఏ యూనియన్ జిల్లా కన్వీనర్ దుర్గం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దేవరాజ్ మృతికి అయిదు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు, పే స్కేల్, ప్రమోషన్, వారసులకు ఉద్యోగం కల్పిస్తాం అని నిండు అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన మాట అమలు కాలేదన్నారు. అసెంబ్లీ బడ్జెట్లో వీఆర్ఏలకు ఎలాంటి కేటాయింపులు లేవని అన్నారు. మా వీఆర్ఏల జీవితాలు ఇక బాగుపడవా అని ప్రశ్నించారు. నిజాం కాలం నుండి నేటి తెలంగాణ లో వీఆర్ఏలు వెట్టి చాకిరీ చేస్తూ ఉండాల్సిందేనా అన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో రూ.10500 గౌరవ వేతనంతో ఎలా కుటుంబాన్ని పోషించేది, పిల్లల చదువులు, ఇంట్లో పూట గడపడం కష్టంగా మారి, అప్పుల బారిన పడినా మా వీఆర్ఏల జీవితాలు బాగుపడవా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కి అయిన సీఎం ఇచ్చిన మాట ప్రకారం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో వీఆర్ఏ నాయకులు సునార్కరి స్వామి, అక్బర్, దుర్గం బాపు తదితరులు పాల్గొన్నారు.