హైదరాబాద్:,జనం సాక్షి):కష్టముందంటూ ఆశ్రయించిన వృద్ధురాలికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి శేషారత్నం(86) సమస్యను పరిష్కరించారు. దాంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన నగరం కార్యక్రమంలో పాల్గొన్న శేషారత్నం తన సమస్యను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్‌కు విన్నవించింది. తన ఇంటికింద కృతుంగా రెస్టారెంట్ నిర్వాహకులు అక్రమంగా వంటగది నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనివల్ల పైఅంతస్తులో ఉంటున్న తమకు ప్రమాదం ఉందని గోడు వెళ్లబోసుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా వంటగది నిర్వహించడంతో పాటు కోర్టు కేసులతో తమను వేధిస్తున్నారని మంత్రి కేటీఆర్ ముందు వాపోయారు. దీనిపై స్పందించిన మంత్రి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన, ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి దేవేందర్‌రెడ్డి, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య ఆధ్వర్యంలోని అధికారుల బృందం శనివారం రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించింది. పై అంతస్తులోని వారికి ఇబ్బందులతో పాటు భారీ సిలిండర్లను వినియోగించడంతో ప్రమాదానికి ఆస్కారం ఉందని గుర్తించింది. రెస్టారెంటు ట్రేడ్ లైసెన్స్‌తో పాటు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేవని అధికారులు గమనించారు. దీంతో వంటగదిని సీజ్ చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారుల చర్యలపై శేషారత్నం సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక శ్రద్ధ చూపించిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
వృద్ధురాలికి అండగా నిలిచిన మంత్రి కేటీఆర్




