– చేతి, మెడపైనా తీవ్రగాయాలు
– ప్రకాశం జిల్లాలో ఘటన
ఒంగోలు, జులై22(జనంసాక్షి) : రాత్రి భోజనం చేసి తమ గదిలోకి వెళ్లి పడుకున్న వృద్ధ దంపతులు తెల్లారేసరికి విగజీవులుగా పడివున్నారు. వారి చేతి మణికట్టుపైనా, మెడపైనా తీవ్రగాయాలు ఉండడంతో వారు ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా హత్య చేశారా? అన్న అనుమానం నెలకొంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దర్శి మండలం అద్దంకి రోడ్డులో సాయిబాబా గుడి సవిూపంలో అన్నపురెడ్డి వెంకటరెడ్డి(70), ఆదెమ్మ(55) దంపతులు కొడుకుతోపాటు నివాసముంటున్నారు. వెంకటరెడ్డి మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో ఆదెమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. నిన్నరాత్రి అంతా భోజనాలు చేశాక వృద్ధ దంపతులు ఇంటి వెనుక గదిలో పడుకున్నారు. సోమవారం ఉదయం తల్లిదంద్రులు ఎప్పటిలా లేవకపోవడంతో అనుమానం వచ్చిన కొడుకు వెళ్లి గది తలుపుకొట్టాడు. ఎంతకీ తీయకపోవడంతో వెనుక నుంచి వెళ్లి చూడగా తల్లీతండ్రి రక్తపుమడుగులో విగత జీవులుగా పడిఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో వారు ఘటనా స్థలిని సందర్శించారు. ఇరువురి చేతి మణికట్టు వద్ద, వెంకటరెడ్డి తలకి, మెడవద్ద తెగి తీవ్ర రక్తస్రావమైనట్లు గుర్తించారు. దీంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా హత్య చేసి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




