రాజమండ్రి,ఫిబ్రవరి26(జనంసాక్షి: పుష్కరాల పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గోదావరి పుష్కరాలకు ఇంకా అయిదు నెలలు మాత్రమే ఉండడంతో పనులు ప్రారంభం విషయంలో ఏర్పడిన అగాధాన్ని తొలగిస్తూ పనులు మొదలుపెట్టారు. గత పుష్కరాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ పనులు చేపడుతున్నట్టు ప్రత్యేక అధికారి జె.మురళి తెలిపారు. దీనిలో భాగంగా 140 విూటర్ల పొడవున్న పుష్కర ఘాట్‌ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించి మరో 150 అడుగులు వరకూ విస్తరిస్తారన్నారు. వీఐపీ ఘాట్ పరిధిని పెంచేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా స్నానాలు, పిండ ప్రదానాలు అర్పించేందుకు వీలుగా సౌకర్యాలు మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆది నుంచి ముందు వరుసలో ఉన్న నీటిపారుదల శాఖ గోదావరి ఘాట్ల అనుసంధానానికి నాంది పలికింది. దీనిలో భాగంగా కోటిలింగాల పేట వద్ద స్నానఘాట్లను విస్తరించి ఏక ఘాట్‌గా అనుసంధానం చేసేందుకు నిర్ణయించింది. కోటిలింగాల రేవు వద్ద 245 విూటర్ల స్నానాల రేవు ఉండగా, అదే వరుసగా ఉన్న మరో మూడు ఘాట్లను అనుసంధానం చేయనున్నారు. అదనంగా 373 విూటర్ల పొడవును పెంచి నిర్మాణం చేయనున్నారు. రూ. 7.74 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. నిర్ణీత వ్యవధిలో, నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇకపోతే ఆటో డ్రైవర్లు, టాక్సీడ్రైవర్లు నిబంధనల మేరకు పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీస్ అధికారులు కోరారు. రానున్న పుష్కరాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని
అన్నారు. అందుకోసం ఇప్పటినుంచి సన్నద్ధం కావాలని కోరారు. రానున్న గోదావరి పుష్కరాల్లో యాత్రికులకు సౌకర్యంగా సేవలందించేందుకు ఆటో డ్రైవర్లు సిద్ధంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ శరత్‌బాబు అన్నారు. రాజమండ్రి నగరంలోని ఆటో యూనియన్ల నాయకులతో ఇటీవల సమావేశం
ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. పుష్కరాల్లో నదీ స్నానానికి వచ్చే యాత్రికులను చేరవేసే ఆటో డ్రైవర్లు పాటించాల్సిన విధివిధానాలపై చర్చించారు. నగర శివారు పరిధిలో ఏర్పాటుచేసే బస్టాండ్లు, ఆటోస్టాండ్ల నుంచి నగరంలోని వివిధ ఘాట్లకు చేరవేసే క్రమంలో వారి నుంచి తీసుకొనే కిరాయి విషయమై అన్ని యూనియన్లూ ఆమోదయోగ్యమైన ధరలు నిర్ణయించాలని సూచించారు. గోదావరి ఘాట్లకు వెళ్లే యాత్రికులను ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించకుండా ఎంతవరకూ తీసుకెళ్లగలమన్న దానిపై చర్చించారు. ఆటోల ధరలు నిర్ణయం విషయంలో వినియోగదారుల ఫోరం సభ్యులను భాగస్వాములు చేస్తే పారదర్శకంగా ఉంటుందన్నారు. పుష్కరాల్లో ట్రాఫిక్ పోలీసుల నిబంధనలను ఆటో డ్రైవర్లు పాటిస్తారని,ఈ విషయంలో తమవంతు సహకారం అందిస్తామన్నారు.




