Wednesday, 4 November 2026

సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు కృషి

కరీంగనర్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): జిల్లాను అక్షరాస్యత కలిగిన సంపూర్తణ జిల్లాగా రూపొందిస్తామని కలెక్టర్‌ నీతూప్రసాద్‌ ప్రకటించారు. ఇందుకు కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని అన్నారు.  జిల్లాలో ఉన్న 6.10 లక్షల మంది నిరక్ష్యరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. సాక్షర భారత్‌ అయిదో దశ అక్షరాస్యతపై జిల్లా రిసోర్సుపర్సన్లకు ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  రెండు రోజుల శిక్షణ అనంతరం జిల్లా రిసోర్సు పర్సన్లు వచ్చే నెల 2, 3 తేదీల్లో 29 మండలాల్లో, 6, 7 తేదీల్లో మిగతా మండలాల్లో శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. తరచూ ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సంపూర్ణ అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్‌  అన్నారు. అందుకు ప్రజలు విద్యావంతుల సహకరాం అవసరమన్నారు. విద్య మానవ హక్కు అని, విద్య ద్వారా దేనినైనా సాధించవచ్చన్నారు. తెలంగాణలోనే అక్షరాస్యతలో అభివృద్ధి చెందిన జిల్లాగా రూపాంతరం చెందాలని అన్నారు. ప్రస్తుతం  అక్షరాస్యతలో 65 శాతం మాత్రమే ఉందని తెలిపారు. దేశ అక్షరాస్యత 71 శాతం, రాష్ట్ర అక్షరాస్యత 67 శాతం ఉందని, ఇందులో జిల్లా వెనుకబడి వుందన్నారు. వచ్చె ఆరు నెలల్లో 1.50 లక్షల మంది నిరక్ష్యరాస్యులను జిల్లా లోక్‌  శిక్షణ సమితి ద్వారా అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *