Wednesday, 4 November 2026

వేతన సవరణకు సానుకూలంగా ఉన్నాం

– ఉమ్మడి సర్వీస్‌ నిబంధనల అంశం హైకోర్టు పరిధిలో ఉంది
– సమస్యలను కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తా
– మంత్రి ఈటెల రాజేందర్‌
హైదరాబాద్‌ , మే5(జ‌నం సాక్షి ) : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి ఈటల రాజేందర్‌ సారథ్యంలోని మంత్రుల కమిటీ శనివారం సమావేశమైంది. ఈ సందర్భంగా టీచర్ల సమస్యలు, సంబంధిత అంశాలపై చర్చించారు. అనంతరం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ విూడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాల నేతలతో చర్చలు జరిపామని తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించిన 4రకాల డిమాండ్లు ఉన్నాయన్నారు. వేతన సవరణ తప్పనిసరిగా చేయాల్సిందేనని, అందుకు సానుకూలంగా ఉన్నామని స్పష్టం చేశారు. బదిలీలు, పదోన్నతలు సాధారణమైనవే అని తెలిపారు. ఉమ్మడి సర్వీస్‌ నిబంధనల అంశం హైకోర్టు పరిధిలో ఉందని గుర్తు చేశారు. ఈ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని సంఘాల నేతలు కోరినట్లు మంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సీపీఎస్‌ విషయమై సీఎంకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఈ అంశంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం చర్చించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.2.50 లక్షల మందికి ఉద్యోగ భద్రత కల్పించామని తెలిపారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదన్న మంత్రి.. ప్రజలకు సేవ చేసే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సహకారంతోనే తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోగా ఎలాంటి ఆరోపణలు లేకుండా బదిలీలు పూర్తిచేస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.
సానుకూల దృక్పథంతో చర్చలు జరిగాయి..
మంత్రుల కమిటీతో చర్చలు సానుకూల దృక్పథంతో జరిగాయని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. పాఠశాల విద్యను సరైన రీతిలో అభివృద్ధి చేయాలని మంత్రుల కమిటీకి విజ్ఞప్తి చేశామన్నారు. పాఠశాల విద్యను అభివృద్ధి చేసే సంఘాలకు చేయూతను ఇవ్వాలన్నారు. పీఆర్‌సీ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రుల కమిటీ హావిూ ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి.