బెల్లంపల్లి, జులై, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని నిత్య చిన్న పిల్లల ఆసుపత్రిలో వైద్యం వికటించి మృతి చెందిన సంఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలం ఐబీ ప్రాంతం కొత్త గుడిసెల ప్రాంతానికి చెందిన కళావతి, జై కిషన్ దంపతులు తమ మూడు నెలల పసికందు అనారోగ్యం బారిన పడటంతో బెల్లంపల్లి పట్టణంలోని నిత్య పిల్లల ఆసుపత్రికి తీసుకువచ్చారు. బాబు జలుబుతో బాధ పడుతున్నాడని వైద్యుడు శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది కలిసి నోటి ద్వారా పైపు వేసి నంజు తీశారని తెలిపారు. బాబు ఏడ్చి కదలికలు లేకుండా ఉండటంతో బాబు పరిస్థితి విషమంగా ఉందని మంచిర్యాలకు తీసుకెళ్లాలని సూచించారని చెప్పారు. వెంటనే బాబును తీసుకొని మంచిర్యాలకు తీసుకెళ్లగా వారు సైతం కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించారు. మంచిర్యాల నుంచి కరీంనగర్ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి బాబు చనిపోయి కొన్ని గంటలు గడిచిందని నిర్దారించడంతో బాధితులు హతశులయ్యారు. బోరున విలపిస్తూ బెల్లంపల్లి చేరుకొని ఆసుపత్రి ముందు బైటాయించి ఆందోళనకు దిగారు. అప్పటికే ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రికి తాళం వేసి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి వరకు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టడంతో వారికి మద్దతుగా పలు రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. వైద్యుడు వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ శంకరయ్య సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
వైద్యం వికటించి చిన్నారి మృతి. – న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు ఆందోళన. – మద్దతు పలికిన పలు పార్టీల నాయకులు.




