వైభవంగా గోదా కళ్యాణం
హుజూర్ నగర్ జనవరి 14 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో శనివారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదా కళ్యాణం వైభవంగా జరిగింది. అర్చక స్వాములు ప్రాత కాలంలో స్వామివారిని అమ్మవారిని అందంగా అలంకరించారు. అర్చన అనంతరం విష్ణు సహస్రం, గోదా, రామానుజ అస్తోత్రాలను చేశారు. తిరుప్పావై సేవాకాలాన్ని మహిళలు వీనుల విందుగా పఠించారు. ఉ.10 గంటలకు అమ్మవారిని తులసిమాలలతో, పూలమాలలతో, పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి భద్ర పీఠంపై మండపంలో అధిష్టింపజేశారు. తదుపరి విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, కంకణ ధారణ జరిపారు. మహాసంకల్పం, చూర్ణిక, మంగళాష్టకాలు వేద పండితులు శ్రావ్యంగా స్తుతించారు. వధువు తరఫు బంధువులుగా స్థానాచార్యులు స్వామివారికి పాదప్రక్షాళన గావించారు. సుముహూర్తానికి కన్యాదానం జరిపి, జీలకర్రను అమ్మవారికి, స్వామివారి శిరస్సున అర్చక స్వాములు అలంకరింపజేశారు. సూత్రధారణ తలంబ్రాలు మేళతాళాల మధ్య అందంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి ఈవో గుజ్జుల కొండారెడ్డి పర్యవేక్షించి కళ్యాణానికి వచ్చిన భక్తులకు ఏ రకమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు, అర్చకులు, దేవాలయ అభివృద్ధి సమితి సభ్యులు, పుర ప్రముఖులు, మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
వైభవంగా గోదా కళ్యాణం




