వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
– పూజలో పాల్గొన్న వందలాది మంది దంపతులు
– భక్తులకు తీర్థప్రసాదాలు, మహా అన్నదానం
వరంగల్ ఈస్ట్, నవంబర్ 29(జనం సాక్షి)
వరంగల్ మహానగరంలోని శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు జాగర్లపూడి శ్రీరామ్ శర్మ ఆధ్వర్యంలో వందలాదిమంది దంపతుల సమక్షంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నవరసాభిషేకాలతో పాటు వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా ఎంతో గొప్పగా నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని ఈసారి మరింత వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా వందలాదిగా వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్నదానాన్ని చేశారు. ఆలయ ఈవో కమల భక్తులకు అన్ని రకాల ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుండి భక్తులు హాజరై స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. నాగేంద్ర స్వామి మహారాజ్ కి జై అంటూ భక్తులు భక్తిశ్రద్ధలతో నామస్మరణ చేశారు. నాగేంద్ర స్వామి తమ కోరికలు తీర్చాలని వేడుకున్నా రు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కమల, ఆలయ ఫౌండర్ ట్రస్ట్ తోట నరసయ్య లింగం, అర్చకులు హరీష్ శర్మ, సిబ్బంది శ్యాంసుందర్, రవీందర్, రాజేందర్, సత్యనారాయణ తోపాటు భక్తులు పాల్గొన్నారు.





