ప్రాజెక్టులు పూర్తవుతున్నా అందని నీరు
హైదరాబాద్,జూలై22(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం విత్తన భాండాగారం కోసం యత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణలో నేలలు విత్తనాలకు అనుకూలం కావడంతో ఆ సంకల్పంతో ముందుకెళుతున్నది. అయితే సానుకూల వాతావరణం లేని కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. రైతాంగ అభివృద్ధిపై దృష్టిపెట్టడం ద్వారా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులు వేగంగా నిర్మాణమవుతున్నాయి. కోటి ఎకరాలకు నీరు అందించాలన్న లక్ష్యంతో సాగుతోంది. కాళేశ్వరం పూర్తితో కల సాకారం కానుంది. అయితే సకాలంలో వర్షాలు రాకపోవడంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో నీరు చేరడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో అత్యంత వెనుకబడిన పాలమూరు ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోవడానికి గత పాలకుల నిర్లక్ష్యమని చెప్పక తప్పదు. పాత మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద గత పాలకులు కేవలం 33,500 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మరో 12 వేల పాత ఆయకట్టుకు నీరందించారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి న మొదటి ఏడాదిలోనే ఏకంగా 3,94,500 ఎకరాలు కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించింది. అంతేకాదు అదనంగా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ మధ్యకాలంలో ఏకంగా ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృత నిశ్చయంతో పనిచేయడమే కాకుండా నిరంతర పర్యవేక్షణ వల్ల పనులు వేగవంతం అవుతున్నాయి. నాగార్జునసాగర్‌లో ఉన్న నీటిని ఎడమ కాల్వ ద్వారా మళ్ళించి యాసంగిలోనే నాలుగు లక్షల ఎకరాలకు పైగా నీరందించింది. వీటితోపాటు గ్రామాల్లో మిషన్ కాకతీయ పనులు వేగం పుంజుకున్నాయి. చెరువుల్లో
నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. అంతేకాదు భూగర్భ జలాల మట్టాలు పైకి రావడంలో ఈ రెండు వనరుల కింద లక్షల ఎకరాల పంట సాగయింది. అలాగే ఈ ఏడాదికాలంలో భారీ నీటి ప్రాజెక్టుల ద్వారా అదనంగా 9.67 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతో పాటు చెరువుల కింద మరో మూడు లక్షల ఎకరాలకు పైగా పంటలకు సాగునీరు ఇవ్వనున్నది. ఎన్నోవిధాలుగా రైతాంగాన్ని ఆదుకోవడం కెసిఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నది. అయినా వర్షాభావం కారణంగా ఎన్నిప్రయత్నాలు చేసినా తీరు మారడంలేదు. రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతికూల పరిస్థితులు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై సవిూక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. లేకుంటే రానున్న కాలంలో రైతులు తమ ఆగ్రహాన్ని చూపే అవకాశం ఉంది. సాగునీటి రంగం బలపడితేనే రైతాంగం బాగుపడుతుంది. అందుకు అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంది.
వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు




