Friday, 6 November 2026

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులుగా బొల్లు యాదగిరి, కొండమడుగు నర్సింహ ఎన్నిక

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులుగా బొల్లు యాదగిరి, కొండమడుగు నర్సింహ ఎన్నిక

మోత్కూరు నవంబర్ 28 జనంసాక్షి : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులుగా బొల్లు యాదగిరి, కొండమడుగు నర్సింహ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 26, 27 తేదీలలో మోత్కూర్ పట్టణంలో నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా రెండవ మహాసభలు ఘనంగా ముగిసినాయి.ఈ సందర్భంగా 32 మందితో నూతన జిల్లా కమిటీని మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన జిల్లా అధ్యక్షులుగా బొల్లు యాదగిరి జిల్లా ఉపాధ్యక్షులుగా జెల్లెల్ల పెంటయ్య, గంగాదేవి సైదులు , రాచకొండ రాములమ్మ , జూకంటి పౌల్, పల్లెర్ల అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా కొండమడుగు నర్సింహ, సహాయ కార్యదర్శులుగా సల్లూరి కుమారు, గుంటూరు శ్రీనివాసచారి, సిరిపంగి స్వామి, కూకుట్ల చొక్కాకుమారి తో పాటు మిగతా 21 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారని నర్సింహ తెలియజేసినారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐదు మండలాల్లో కొనసాగుతున్న భూ పంపిణీ నిషేధం ఎత్తివేసి జిల్లాలో ఉన్న ప్రభుత్వ మిగులు భూములన్నింటిని పేదలకు పంచాలని, ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి నూతన పాస్బుక్కులు ఇవ్వాలని, ఇల్లు లేని పేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చి నిర్మాణానికి రూ అయిదు లక్షలు ఇవ్వాలని, గతంలో ప్రభుత్వాలు ఇంటి స్థలం ఇచ్చిన పేదలకు ఆ స్థలాలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని, ప్రాజెక్టుల పేరుతో, కాలువల పేరుతో, దేవాలయాల పేరుతో పేదల నుండి తీసుకున్న భూములకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాల చట్టాన్ని అమలు చేసి రోజు కనీస కూలీ 600 రూపాయలు నిర్ణయించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 17 రకాల నిత్యవసర వస్తువులను అందించాలని, అన్ని మండల కేంద్రాలలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటలు వైద్యము అందించే విధంగా డాక్టర్స్ ను సిబ్బందిని నియమించి అన్ని రకాల జబ్బులకు వైద్యం అందించాలని, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పరిరక్షించాలని, ప్రతి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని, జాతీయ గ్రామీణ ఉపాదామిని సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి, రోజు కూలి 600 ఇవ్వాలని, మున్సిపల్ పట్టణాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి పనులను ప్రారంభించి పేదలకు పనులు కల్పించాలని, జిల్లాలో కొనసాగుతున్న కుల వివక్షత, కుల దురంకార హత్యలను నివారించి, ప్రతి నెల 30 తేదీన పౌరహక్కుల దినము విధిగా నిర్వహించాలని, సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక సమస్యలు పరిష్కరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులను పెంచాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేసి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని, దళిత బంధు అన్ని గ్రామాల్లో అమలు చేయాలని, వ్యవసాయ కూలీలు నివసిస్తున్న వాడలకు ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని మహాసభ ఏకగ్రీవంగా తీర్మానం చేశారని కొండమడుగు నర్సింహ తెలియజేశారు. రానున్న ఉన్న కాలంలో జిల్లా వ్యాప్తంగా కూలీ, భూమి, ఉపాధి, సామాజిక సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని తెలియజేశారు.