Tuesday, 3 November 2026

శభాష్ అనిపించుకున్న చైనా పెళ్లి కూతురు:

చైనా పెళ్లి కూతురు యాన్ శభాష్ అనిపించుకుంది. ఆమె సాహసం పట్ల చైనా మీడియా ప్రశంసలతో ముంచెత్తుతోంది. ఇంతకీ ఆ పెళ్లి కూతురు ఏం చేసిందంటే? నీటిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని కాపాడింది. అందరితో అదుర్స్ అనిపించుకుంది. వివరాల్లోకి వెళితే చైనాలోని డాలియన్ సెంట్రల్ ఆసుపత్రిలో గూ యాన్ యాన్ అనే అమ్మాయి నర్సుగా పనిచేస్తోంది. మరికాసేపట్లో తనకు పెళ్లి జరుగుతుందనగా ఈ సాహసం చేసింది. 
పెళ్లి కూతురు వస్త్రాల్లో అందంగా తయారైన యాన్ మిలమిలా మెరిసిపోతూ.. చైనాలోని ఓ సముద్ర తీరంలో ఫోటోలకు ఫోజులిస్తోంది. ఇంతలో సముద్రంలో ఓ వ్యక్తి మునిగిపోతున్నట్లు గమనించింది. అంతే వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించింది. ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకిన యాన్ అతడిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చింది. అప్పటికే అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని గమనించిన యాన్.. ఏమాత్రం ఆందోళన పడకుండా అతనికి తన నోటి ద్వారా కృత్రిమ శ్వాస అందించడం, ఛాతి భాగంలో చేతులతో గట్టిగా నొక్కడం చేసింది. 
ఈ క్రమంలో ఆ వ్యక్తి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. నర్సుగా పనిచేసే అనుభవమే ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు ఎంతగానో తోడ్పడింది. ప్రస్తుతం ఆమెపై చైనా స్థానిక మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అటు యాన్ పెళ్ళాడనున్న చాంగ్ కూడా తనకు కాబోయే భార్య సాహసానికి తెగ మురిసిపోతున్నాడు. యాన్ సమయస్ఫూర్తి పట్ల హర్షం వ్యక్తంచేసిన చాంగ్.. చాలా గర్వంగా ఉందన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *