శాటిలైట్ మ్యాప్ తో సంబంధం లేకుండా పోడు భూములకు పట్టాలివ్వాలి. సి పి ఐ
పెనుబల్లి, డిసెంబర్ 5(జనం సాక్షి)
శాటిలైట్ మ్యాప్ లతో సంబంధం లేకుండా పోడు సాగు చేసుకుంటున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సింగు నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెనుబల్లి మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామం లోసోమవారం సీపీఐ లింగగూడేం, గట్టుగూడెం గ్రామ శాఖల జనరల్ బాడీ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ 2005 సంవత్సరం ముందునుండే గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్నారని,అటవీ అధికారులు మాత్రం ఎక్కడినుండో కొనుగోలు చేశామని చెబుతూ శాటిలైట్ మ్యాప్ లను ప్రదర్శిస్తున్నారని, ఆ మ్యాప్ లకు విశ్వసనీయత లేదని అన్నారు.ప్రభుత్వం ఆర్భాటంగా పట్టలిస్తామని సర్వే చేసి,గ్రామసభలు జరుపుతుంటే అదే గ్రామసభల్లో అటవీ అధికారులు క్లైమ్ లను తిరస్కరిస్తున్నారు అని విమర్శించారు ప్రభుత్వం ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.పోడు భూముల సమస్యతో పాటు డబుల్ బెడ్ రూం ఇళ్ళు,రేషన్ కార్డులు, పెన్షన్లు సమస్యలపై ఈ నెల 14 వ తేదీన మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.అదే విధంగా ఈ నెల 7వ తేదీన గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని చలో రాజ్ భవన్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 26 వ తేదీ సీపీఐ 98వ వార్షికోత్సవం ను ఘనంగా జరపాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ,పెనుబల్లి మండల కార్యదర్శి కొమ్మినేని సుధాకర్,ఎఫ్ ఆర్ సి కమిటీ చైర్మన్లు పైద కిరణ్, మడకం రమేష్,మహిళ సమాఖ్య నాయకులు లక్ష్మి,సునీత,తదితరులు పాల్గొన్నారు.




