శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్
విజయనగరం,మే5(జనం సాక్షి ): పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో దీక్షాంత్ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం మంత్రి గంటా అందుకున్నారు. 618 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. పోలీస్ పాసింగ్ పరేడ్ ను తిలకించేందుకు భారీగా పోలీసులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్టాడుతూ..శిక్షణ
ముగించుకుని విధుల్లోకి చేరబోతున్న 618 మంది కానిస్టేబుళ్లకు నా అభినందనలు. మహిళలు పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నించడం అభినందించదగ్గ విషయం. ప్రజలకు ఒక భరోసా పోలీస్
వ్యవస్థ,నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన శాఖ పోలీస్ శాఖ అని, ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారిపట్ల హుందాగా పోలీసులు వ్యవహరించాలి అని అన్నారు. సాయం కోసం వచ్చే వారిని ఆదరించి వారికి న్యాయం చెయ్యాలి. మానవత్వంతో పనిచేయాలి. శాంతిభద్రతల విషయంలోనే కాదు సమాజంలో ప్రతీ అంశంపై దృష్టి సారించాలి. ఎన్ని ఉద్యోగాలు ఉన్నా పోలీస్ ఉద్యోగం వేరు. అది చాలా బాధ్యతాయుతమైనది అని అన్నారు.