Thursday, 5 November 2026

శివనామ స్మరణతో మార్మోగుతున్న శివాలయాలు

శివనామ స్మరణతో మార్మోగుతున్న శివాలయాలు

మల్దకల్ నవంబర్12(జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లాలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి.శివ దీక్ష తీసుకున్న శివ స్వాముల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం శివాలయాలలో లింగార్చన,బిల్వార్చన, పంచామృతాభిషేకాలతో పూజలు నిర్వహిస్తున్నారు. మల్దకల్ మండలం చర్ల గార్లపాడు గ్రామంలో శనివారం వెంకటేశ్వర్ రెడ్డి స్వామి ఆధ్వర్యంలో శివ స్వాములు ఓబులేష్,నరేందర్, పరశురాముడు,మౌలాలి, పరశురాముడు,నరేష్ గౌడ్ శివదీక్షను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
శివ దీక్ష నియమములు
చందనపు రంగుల బట్టలు ధరించాలి.కొందరు నీలపు రంగు వస్త్రాలు కూడా ధరిస్తుంటారు.
దీక్షాకాలంలో చెప్పులు తొడగకూడదు .
క్షౌరము చేయించుకోకూడదు.
త్రికాలమునందు స్నానము చేసి శివపూజ చేయాలి. మూడుపూట్లా వీలుకానివారు , ఉదయము, సాయంకాలము రెండుపూట్లా శివుని విధిగా పూజించాలి.రుద్రాక్ష మాలని ధరించాలి.నుదుటన చందనము విభూతి కుంకుమను పెట్టుకోవాలి.
దీక్ష సమయంలో మౌనవ్రతులై ఉండాలి.అవసరమైనంతవరకే అంటే మితంగా మాట్లాడాలి .
నిత్యం,అనుక్షణం శివభక్తిని వీడకూడదు.ఇతరులను పిలిచినప్పుడు అయ్యప్ప భక్తులు “స్వామి “అన్నట్లు “శివా” భక్తులు కూడా “శివ” అని పిలుస్తుండాలి.
అవకాశమున్న సార్లు “శివపంచాక్షరీ” ఓం నమశ్శివాయ అని జపము చేసుకుంటూ ఉండాలి.ఒక బీజాన్ని మట్టిలో నాటినట్టు, మనసులో ఈ పంచాక్షరీ మంత్రాన్ని నాటుకోవాలి,
ఒంటి పూట శాఖాహార భోజనం చేస్తూ,నేలపై నిద్రించాలి.