Tuesday, 3 November 2026

శిశువు మృతదేహాన్ని..  పీక్కుతిన్న వీధికుక్కలు!

– శంషాబాద్‌లో ఘటన
హైదరాబాద్‌, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ శంషాబాద్‌ లో దారుణం జరిగింది. ప్రాణాలు కోల్పోయి పుట్టిన ఓ ఆడశిశువును వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. చనిపోయిన శిశువును ఆసుపత్రి వెనక తల్లిదండ్రులు పూడ్చిపెట్టారు. వీధికుక్కులు మృతదేహాన్ని బయటకు లాగి పీక్కుతిన్నాయి. వివరాల్లోకి వెళితే.. బీహార్‌ రాష్ట్రానికి చెందిన రజినీ సుమన్‌, సునీతా కుమారి దంపతులు మైలార్‌ దేవ్‌ పల్లిలో నివాసముంటున్నారు. సునీత ఇప్పటికే రెండు సార్లు గర్భం దాల్చినప్పటికీ, అనారోగ్య కారణాల వల్ల అబార్షన్‌ జరిగింది. మూడో సారి గర్భం దాల్చడంతో ప్రసవం కోసం ఈనెల 15న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల కేంద్రంలోని సివిల్‌ ఆసుపత్రిలో చేరింది. అదేరోజు సాయంత్రం సునీత ఓ ఆడశిశవుకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ కడుపులోనే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. మూడోసారి కూడా బిడ్డ దక్కకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. డిశ్చార్జ్‌ చేసేముందు వివరాల కోసం ఆసుపత్రి సిబ్బంది ఆదార్‌ కార్డు అడిగారు. సుమన్‌ ఆదార్‌ కార్డు తీసుకుని వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తరువాత సునీత కూడా చెప్పాపెట్టకుండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయింది. ఈ తరువాత ఆసుపత్రి వెనక ఉన్న వీకర్‌ సెక్షన్‌ కాలనీలో ఓ ఇంటి వద్ద వీధి కుక్కలు పసికందు మృతదేహాన్ని పీక్కుతింటూ ఉండడం కనిపించింది. ఈ ఘటన స్థానికంగా సంచలన సృష్టించింది.