Monday, 2 November 2026

షీటీమ్స్‌తో యువతుల్లో భరోసా

పోకిరీలపై పలు కేసులు నమోదు

హైదరాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): యువతులు, మహిళల పట్ల అనుచిత ప్రవర్తన, లైంగిక వేధింపులకు గురిచేసిన పోకిరీలపై షీ టీమ్స్‌ రాచకొండ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన మూడు వారాల్లో పలువురు ఈవ్‌ టీజర్స్‌పై 21 ఎఫ్‌ఐఆర్‌లు, 20 పిటీ కేసులు నమోదు చేశారు. అదేవిధంగా 56 మందికి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. వీరిలో 16 మంది మైనర్లు. నిందితుల్లో బస్‌ కండక్టర్‌, లెక్చరర్‌, పెయింటర్‌ ఇలా పలువురు ఉన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ఇంటర్‌ చదివే విద్యార్థినిని కండక్టర్‌ వేధింపులకు గురిచేసేవాడు. కండక్టర్‌ ప్రవర్తనపై విద్యార్థిని షీ టీంకు వాట్సప్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. పోలీసులు కండక్టర్‌ శ్రీనివాస్‌ను అరెస్టు చేసి పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరొక ఘటనలో పెండ్లి పేరుతో విద్యార్థిని ఓ లెక్చరర్‌ అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 376, 417, 420, 493 కింద కేసులు నమోదు చేశారు. సోషల్‌ విూడియా సైట్‌ ఫేస్‌బుక్‌ ద్వారా నర్సింగ్‌ విద్యార్థిని వివరాలు సేకరించి ఓ పెయింటర్‌ వేధింపులకు పాల్పడ్డాడు. ఫిర్యాదుతో యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళలు నిర్భయంగా తమకు జరిగిన అన్యాయాలను తెలియచేస్తేనే చర్యలకు ఆస్కారం ఉంటుందని పోలీస్‌ అధికారులు అన్నారు.