సంగారెడ్డిలోనూ తప్పని అసమ్మతి బెడద
జహీరాబాద్ స్థానంపై కానిరాని స్పష్టత
నేతలతో మంత్రి హరీష్ రావు మంత్రాంగం
సంగారెడ్డి,సెప్టెంబర్27(జనంసాక్షి): జిల్లా నుంచి రాష్ట్ర శాసనభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో జహీరాబాద్ పెండింగ్‌లో పెట్టారు. అందోలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ను తప్పించి, ఆయన స్థానంలో పాత్రికేయుడు క్రాంతి కిరణ్‌కు అవకాశం ఇచ్చారు. జిల్లాలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించినా సంతృప్తి సెగలు చల్లారడం లేదు. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అసమ్మతి నేతలు స్వరం విప్పారు. పటాన్‌చెరు, నారాయణఖేడ్, సంగారెడ్డి, నర్సాపూర్‌లో పార్టీ ప్రకటించిన అభ్యర్థులను మార్చాలంటూ సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు వినిపించాయి. ఉద్యమ సమయంలో పదవీ త్యాగం చేసిన తనకు టికెట్ ఎందుకు ఇవ్వరంటూ సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ప్రెస్‌విూట్ నిర్వహించి తన ఆవేదన వెల్లగక్కారు. పటాన్‌చెరులో సపాన్‌దేవ్, గాలి అనిల్ కుమార్, కొలను బాల్‌రెడ్డి, జె.రాములు తదితర నేతలు ఉమ్మడి ప్రెస్‌విూట్‌లో అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. నారాయణ ఖేడ్‌లో పార్టీ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని మార్చాలంటూ అసమ్మతి నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నర్సాపూర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యేకు సహకరించేది లేదని హత్నూర జెడ్పీటీసీ సభ్యులు జయశ్రీ తదితరులు తెగేసి చెప్పారు. పార్టీలో నెలకొన్న అసమ్మతిని అభ్యర్థులే పరిష్కరించుకోవాలని టీఆర్‌ఎస్ అధిష్టానం నుంచిసంకేతాలు అందాయి. అసమ్మతికి దారితీస్తున్న కారణాలను విశ్లేషించుకుని పనితీరు మార్చుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసింది. పార్టీ సంకేతాలను సీరియస్‌గా తీసుకున్న సంగారెడ్డి, పటాన్‌చెరు, అందోలు అభ్యర్థులు అసంతృప్తి నేతలతో వరుసగా మంతనాలు జరుపుతున్నారు. నేరుగా వారికి ఇళ్లకు వెళ్లి ఎన్నికల్లో మద్దతు పలకాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. నారాయణఖేడ్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులుగా మరోమారు అవకాశం దక్కించుకున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు మాత్రం అసమ్మతి నేతలతో దూరం పాటిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రోజురోజుకూ విభేదాలు మరింత తీవ్రం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
అసమ్మతి స్వరం బలంగా వినిపిస్తున్న నేతలతో మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. పార్టీకి నష్టం కలిగించే రీతిలో తొందరపాటు చర్యలకు పూనుకోవద్దని హరీశ్ అసమ్మతి నేతలకు సర్ది చెప్పినట్లు సమాచారం. సంగారెడ్డిలో అసమ్మతి నేతలతో సఖ్యత కోసం పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ సొంత ప్రయత్నాలు చేస్తుండగా, ఒకరిద్దరు నేతలతో త్వరలో హరీశ్ భేటీ కానున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అసమ్మతి నేతలతో సంప్రదింపుల బాధ్యతను పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్‌కు అప్పగించారు.