న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : ఢిల్లీ సచివాలయంలో మీడియాపై నిషేధం విధించారన్న ఆరోపణలను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఖండించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయమని… ఎక్కడైనా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన అన్నారు. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు… ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు నిషేధం అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సచివాలయంలో మీడియాపై నిషేధం లేదని… వాళ్లు వస్తున్నారని చెప్పారు. మీరు అపాయింట్‌మెంట్ తీసుకుని రావాలని… నేను ప్రజలను కలుస్తుంటానని ఆయన తెలిపారు. ముందు మమ్మల్ని కలవాలని మీరు అంటున్నారని.. అది ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. ముందు ప్రజలను కలుస్తామని… పని చేసిన తర్వాత సమయం ఉంటేనే మీడియాతో మాట్లాడతామని సిసోడియా స్పష్టం చేశారు. దానికి నిషేధం అని పేరు పెట్టి మమ్మల్ని అవమానపరుస్తున్నారని ఆయన అన్నారు.




