– తెరాస తీరును ప్రజల్లో ఎండగట్టగలిగాం
– పార్టీ సరిగా స్పందించలేదనడం కోమటిరెడ్డి, సంపత్‌ల ప్రచారమే
– పార్టీ బలోపేతానికి ఐక్యంగా ముందుకు సాగుతాం
– ఎన్నికల సమయంలోగా పార్టీ కార్యక్రమాలను ఉదృతం చేస్తాం
– జానారెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకొనే వాళ్లూ ఉన్నారు
– మా అబ్బాయి ఎక్కడినుండి పోటీచేస్తారనేది అధిష్టానం నిర్ణయిస్తుంది
– విలేకరుల ఇష్టాగోష్టిలో సీఎల్పీ నేత జానారెడ్డి
హైదరాబాద్, మే5(జనం సాక్షి ) : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కమార్ శానససభా సభ్యత్వాల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ సరిగా స్పందించలేదన్న వాదనను సీఎల్‌పీ నేత కె. జానారెరెడ్డి తోసిపుచ్చారు. ఈ అంశంలో చేయాల్సిందంతా చేశామని చెప్పుకొచ్చారు. సీఎల్పీ సమావేశం అనంతరం జానారెడ్డి
విూడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, అకాల వర్షాలపై సమావేశంలో చర్చించామన్నారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌లను మేము పట్టించుకోవటం లేదన్నది అసత్యంమని, వారి కోసం అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేశామన్నారు. అదే సమయంలో ప్లీనరీకి వెళ్ళామని, ఆ ఇద్దరు కూడా ప్లీనరీకి వచ్చారు కదా అని పేర్కొన్నారు. ఇంకా ఏంచేయాల్సి ఉందో చెప్పాలన్నారు. అభిషేక్ సింఘ్విని హైకోర్టుకి పిలిచింది పార్టీనే అని, ఆయనతో మాట్లాడింది కూడా నేనేనన్నారు. ప్లీనరీ కంటే ముందే రాహుల్ గాంధీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లామని, లా కమిటీ సభ్యుడితో కూడా మాట్లాడి సలహాలు తీసుకున్నామని, అభిషేక్ సింఘ్వితో మాట్లాడిన అంశాన్ని సంపత్, కోమటిరెడ్డికి కూడా వివరించామని జానా తెలిపారు. రాహుల్ గాంధీ కూడా సింఘ్విని పిలిచి ఎమ్మెల్యేల కేసును చూడమని చెప్పారని జానా అన్నారు. పార్టీ పట్టించుకోవటం లేదని సంపత్, కోమటిరెడ్డిలు చేసుకునే ప్రచారం మాత్రమేనని, వాళ్ళ వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకుంటామని, అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామని జానా తెలిపారు. ఫిరాయింపుదారులు రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఓటేశారని సుప్రీంకోర్టులో సాక్ష్యంగా ఇస్తామని, కాంగ్రెస్‌కు 10 ఓట్లే ఉన్నాయని మాకు తెలుసని, గెలుస్తామని పోటీ పెట్టలేదన్నారు. పార్టీలో మార్పులు, చేర్పులు గురించి నాకు తెలియదని, తెలంగాణలో ఎన్నికలకు ఏడాది సమయం ఉందని, పార్టీ కార్యాచరణ మరింత వేగం పెరుగుతుందన్నారు. ఎన్నికల నాటికి పార్టీ కార్యక్రమాలు ఉదృతం అవుతాయని నమ్ముతున్నానని జానా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆరు నెలల ముందే ఇచ్చి ఎన్నికలకు పోతే బాగుండేది అని భావన ఉందన్నారు. కానీ కేంద్రంలో 25 మంది ఎంపీలు బయటకు పోతే.. ప్రభుత్వమే పడిపోయేదని, అపుడు తెలంగాణ రాకుండా పోయేదన్న చర్చ కూడా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ చేసింది కరెక్టు అని, పార్టీ అధికారంలోకి రావాలని అందరం ప్రయత్నం చేస్తున్నామని జానా పేర్కొన్నారు. కొన్నిసార్లు టీమ్ లీడర్ సెంచరీ కొట్టినా మ్యాచ్ గెలవరని, కానీ లీడర్ 10 పరుగులు చేసినా ఒక్కొక్కసారి టీమ్ గెలుస్తుందని, మా స్పిరిట్ కూడా అంతే నని ఎవరి స్థాయిలో వారు పని చేస్తున్నారని జానా తెలిపారు. జానారెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనే వారున్నారని, నా కంటే ఎక్కువ అర్హత ఉంది అని ఎవరన్నా అనుకుంటే అందరూ ఒప్పుకోరని తెలిపారు. మా అబ్బాయి ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపిన జానా.. ప్రజలు సీరియస్‌గా కాంగ్రెస్ గురించి ఆలోచించాలన్నారు. కర్ణాటకలో మళ్లీ మా పార్టీయే గెలుస్తుందని జానారెడ్డి పేర్కొన్నారు.
——————————–
సభ్యత్వాల రద్దుపై చేయాల్సిందంతా చేశాం




