Friday, 6 November 2026

సమస్యలను పరిష్కరించండి

టిటిడి శిల్పకళాకారుల వినతి

తిరుపతి,నవంబర్‌15(జ‌నంసాక్షి): చాలా సంవత్సరాల నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులెవ్వరూ తమ గోడును పట్టించుకోలేదని టిటిడి శిల్ప కళాకారులు వాపోయారు. శిల్ప కళాకారులంతా టిటిడి పాలక మండలి సభ్యులు చల్లా రామచంద్రారెడ్డిని గురువారం కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం బమ్మయ్యగారి పల్లి గ్రామ పంచాయతీలో నివాసం ఉన్న టిటిడి పాలక మండలి సభ్యులు చల్లా రామచంద్రారెడ్డిని ఆయన స్వగృహం వద్ద టిటిడి శిల్ప కళాకారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శిల్ప కళాకారులు మాట్లాడుతూ.. టిటిడి పాలక మండలి సభ్యులుగా నియమితులైనప్పడి నుండి టిటిడిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ విభాగాలలోని ఉద్యోగుల, కార్మికుల సమస్యల పరిష్కారానికి రామచంద్రరెడ్డి చేస్తున్న కృషిని గుర్తించి తమ సమస్యలను తెలుపుకోవడానికి వచ్చామన్నారు. శిల్ప కళాకారులుగా పనిచేస్తూ చాలీచాలని కూలీతో జీవనం సాగిస్తున్నామని ఆవేదన చెందారు. ఎన్నో దెబ్బలు తగిలించుకుని జీవనం సాగిస్తుంటే.. టిటిడి నూతనంగా కాంట్రాక్టు కార్మికులని నియమించి వారి చేత పని చేయించుకొంటూ తమ పొట్ట కొడుతున్నారని వాపోయారు. శిల్ప కళాకారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆసుపత్రులకు వేలకు వేలు ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని శిల్ప కళా కారులకు హెల్త్‌ కార్డులను మంజూరు చేయించేలా చర్యలు తీసుకోవాలని రామచంద్రారెడ్డిని కోరారు. కాంట్రాక్ట్‌ పని వారిని తీసుకోకుండా తమకు పని కల్పించాలని కోరారు. అనంతరం టిటిడి పాలకమండలి సభ్యులు చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. శిల్ప కళాకారుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చారు.