సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనది
– టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావుకు సన్మానం
హుజూర్ నగర్, డిసెంబర్ 19 (జనంసాక్షి): సమాజంలో జర్నలిస్టు పాత్ర ఎంతో కీలకమైనదని హుజూర్ నగర్ 16వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కారింగుల విజయవెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కుక్కడపు మహేష్ అన్నారు. సోమవారం హుజూర్ నగర్ పట్టణంలోని 16 వ వార్డు లో టియుడబ్ల్యూజే( ఐజేయు) జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన కోల నాగేశ్వరరావును కౌన్సిలర్ విజయ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు. జర్నలిస్టులు ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులు సమాజ శ్రేయస్సుకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబడి సమస్యల పరిష్కారంలో ముందుండాలన్నారు. స్వాతంత్ర ఫలాలు పేదలకందేలా దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు కంబాల శ్రీనివాసు, పి. కోటేశ్వరరావు, దళపతి సంపత్ వర్మ, బోళ్ల గోవిందరెడ్డి, అనిల్ కుమార్, రాము పాల్గొన్నారు.
సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనది




