Tuesday, 3 November 2026

సమైక్య పాలనలో తెలంగాణకు శఠగోపం

7
రెండు సైనిక్‌ స్కూళ్లు ఆంధ్రాకే

గద్దల్లా తన్నుకుపోయిన సమైక్య పాలకులు

తెలంగాణ విద్యార్థులకు స్థానికత సమస్య

సైనిక్‌ స్కూళ్లపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం

హైదరాబాద్‌, నవంబర్‌ 23 (జనంసాక్షి) : సమైక్య పాలకుల పాపానికి తెలంగాణ విద్యార్థులకు సైనిక్‌ స్కూల్స్‌ విద్య కరువైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు సైనిక్‌ స్కూల్స్‌ ఇచ్చినా తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి దక్కనివ్వలేదు. ఆ రెండు స్కూళ్లలో ఒకటి 1962లో విజయనగరం జిల్లా కోరుకొండకు, మరొకటి 2011లో చిత్తూరు జిల్లా కలికిరికి తరలించారు. దీనికి ముమ్మాటికీ సమైక్య పాలకుల పాపమేనని స్పష్టమవుతోంది. ఫలితంగా తెలంగాణ విద్యార్థులు సైనిక్‌ స్కూళ్లలో చదివేందుకు నోచుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో.. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఒక సైనిక్‌ స్కూల్‌ను ఏర్పాటు చేసే విధంగా కేంద్రప్రభుత్వం ఆలోచించాలని యావత్‌ తెలంగాణ ప్రజలతోపాటు ‘జనంసాక్షి’ పత్రిక కూడా కోరుకుంటోంది.

దేశవ్యాప్తంగా 24 సైనిక్‌ స్కూల్స్‌…

ప్రధానంగా జాతిసేవ చేసే పిల్లలకు విద్యనందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా 24 సైనిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేసింది. ఈ స్కూళ్ల ద్వారా వారందరికీ నాణ్యమైన విద్యనందించి రేపటి భారతానికి సమర్థులైన, ఉత్తమ పౌరులను అందించాలనే సంకల్పంతో భారత మొదటి ప్రధాని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే 1962లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్కూల్‌ను కేటాయించారు. దాన్ని విజయనగరం జిల్లా కోరుకొండలో స్థాపించారు. అలాగే చాలా ఏళ్ల తర్వాత 2011లో కూడా మరో స్కూల్‌ ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేస్తే దాన్నీ తెలంగాణకు దక్కకుండా వలసపాలకులు చిత్తూరు జిల్లా కలికిరికి గద్దల్లా తన్నుకుపోయారు. రెండోసారి వచ్చిన స్కూల్‌ను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కడప జిల్లాకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. కానీ ఆయన అకాల మరణంతో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత రాయలసీమకు చెందిన వ్యక్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు  ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌రెడ్డి అధికారాన్ని చేపట్టారు. దీంతో ఆ స్కూల్‌ను కూడా తెలంగాణకు దక్కకుండా రాయలసీమ ప్రాంతానికే తరలించుకుపోయారు. ఫలితంగా తెలంగాణలో ఒక్క సైనిక్‌ స్కూల్‌ కూడా లేదంటే.. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రి పాపమేనని చెప్పుకోవచ్చు.

ఆరోతరగతి నుంచి 12వరకు ఉచితంగా విద్య…

ఈ సైనిక్‌ స్కూళ్లలో ఆరోతరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యనందిస్తారు. ఈ స్కూళ్లలో ప్రధానంగా దేశ రక్షణ రంగంలో పనిచేసే సైనికుల పిల్లలు, వైమానిక దళంలో పనిచేసే పిల్లలు, ఇతర వెనుకబడిన తరగతుల పిల్లలు నియామక పరీక్షల ద్వారా ప్రవేశాలు పొందుతారు. ఆరో తరగతి ప్రవేశాల కోసం ఒక కేటగిరీ, తొమ్మిదో తరగతి ప్రవేశాల కోసం మరో కేటగిరీల్లో నియామక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తారు. వ్యక్తిగత అభివృద్ధి, మానసిక వికాసం(బుద్ధి బలం పెంపొందే), శారీరక దృఢత్వం పెంపొందించుకునే విధంగా విద్యనందిస్తారు.

తెలంగాణ విద్యార్థులకు స్థానికత సమస్య…

తెలంగాణ విద్యార్థులు కొందరు నియామక పరీక్షల ద్వారా అర్హత సాధించి ఆంధ్రాలోని సైనిక్‌స్కూళ్లలో చదువుతున్నారు. వారికి ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన తర్వాత స్థానికత సమస్య తలెత్తుతోంది. సాధారణంగా హైస్కూల్‌ విద్యను ఎక్కడ అభ్యసిస్తే అక్కడే స్థానికతగా ఇప్పటివరకు పరిగణిస్తున్నారు. మరి సైనిక్‌ స్కూళ్లేమో ఆంధ్రాలో ఉన్నాయి. తప్పని పరిస్థితిలో తెలంగాణ విద్యార్థులు అక్కడ చదవాల్సి వస్తోంది. ఈ ప్రకారం.. సైనిక్‌స్కూళ్లలో చదివే తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ స్థానికత వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య వారి భవిష్యత్‌కు ఒక సవాల్‌గా మారనుంది. ఈ తరుణంలో ఆంధ్రాలోని సైనిక్‌ స్కూళ్లలో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు స్థానికత ఎక్కడి నుంచి కల్పిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచిచూడాల్సిందే.

తెలంగాణకూ ఓ సైనిక్‌ స్కూల్‌ ఇవ్వాలి…

సమైక్య పాలనలో తెలంగాణకు అన్నింటా శఠగోపమే మిగిలింది. ఇందుకు మంచి ఉదాహరణ సైనిక్‌ స్కూల్స్‌ దక్కకపోవడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు స్కూల్స్‌ వస్తే ఆ రెండూ ఆంధ్రాకే వెళ్లిపోయాయి. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సైనిక్‌ స్కూల్‌ లేకుండా పోయింది. కావున ఈ విషయాన్ని గమనించి దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన సందర్భంగా నూతన తెలంగాణ రాష్ట్రానికి ఒక సైనిక్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయాలి. తద్వారా తెలంగాణ రాష్ట్రం విద్యార్థులకు సైనిక్‌ స్కూల్‌ విద్య అందిందేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి. అందుకు రాష్ట్రం ప్రభుత్వం కూడా స్పందించి కేంద్రంతో సంప్రదించి నూతన తెలంగాణ రాష్ట్రంలో ఒక సైనిక్‌ స్కూల్‌ను ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని యావత్‌ తెలంగాణ ప్రజలు, విద్యార్థుల తరపున జనంసాక్షి దినపత్రిక కోరుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *