Thursday, 5 November 2026

సాయిబాబా గుడివద్ద దారుణం

ఫుట్‌పాత్‌ యాచకుడి దారుణ హత్య

హైదరాబాద్‌,జూన్‌11(జ‌నం సాక్షి): ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ వ్యక్తిని రాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అర్థరాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ పీజీ రెడ్డి కథనం ప్రకారం.. దీపక్‌సింగ్‌ అలియాస్‌ గోర (35) చాదర్‌ఘాట్‌లోని సాయిబాబా గుడి సవిూపంలోని ఫుట్‌పాత్‌పై నివాసముంటున్నాడు. గుడికి వచ్చే వారిని యాచించడంతో పాటు తోటి యాచకులపై జులుం చెలాయించేవాడు. ఈ క్రమంలో వివాహమై భర్తను వదిలివేసిన ఓ మహిళతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఇద్దరు గుడి వద్ద యాచిస్తూ వచ్చిన దాంట్లో మద్యం సేవించి ఫుట్‌పాత్‌పై పడుకుంటున్నారు. కాగా… అర్ధరాత్రి మద్యం సేవించి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న దీపక్‌సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తలపై రాళ్లతో మోది దారుణంగా హత్యచేశారు. తెల్లవారు జామున సమాచారం అందుకున్న పోలీసులు సంఘట న స్థలంలో వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా.. అతనితో సహజీవనం చేస్తున్న మహిళ… హత్య జరిగిన సమయంలో అక్కడ లేకపోవడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సుల్తాన్‌బజార్‌ ఏసీపీ డాక్టర్‌ చేతన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను పట్టుకునేందుకు ఐదు టీంలను ఏర్పాటు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ పీజీ రెడ్డి తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించామని, ఓ సీసీ కెమెరాలో ముగ్గురు వ్యక్తులు అక్కడ తచ్చాడిన ట్లు గుర్తించామన్నారు. హతుడి మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదని, తోటి వారిని బెదిరించడం, దాడులకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడేవాడని .. తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఇదే అతని హత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. త్వరలో నిందితులను అరెస్ట్‌ చేసి.. హత్యకుగల కారణాలను బహిర్గతం చేస్తామని తెలిపారు.