– డ్యామ్‌ని నింపుతామన్న మాట నిలబెట్టుకోవాలి
– నీటినినింపే వరకు 18నుంచి తన భార్యతో కలిసి రిలే దీక్షలు చేస్తా
– సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి15(జనంసాక్షి) : సింగూరు, మంజీరా డ్యాంమ్‌లలో నీటిని నింపే వరకు పోరాటం చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. సింగూరు జలాల కోసం తన భార్యతో కలిసి ఈనెల 18 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తానని అన్నారు. సింగూరు నీళ్ల కోసం తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. సింగూరు జలాలపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ జీవో లేకుండా నీళ్లు తరలించడం అక్రమమని మండిపడ్డారు. నీటి తరలింపునకు కారణం హరీష్‌రావే అని ఆయన ఆరోపించారు. సింగూరును తన జాగీరులా హరీష్ వ్యవహరించారని దుయ్యబట్టారు. సింగూరు డ్యామ్‌ని నింపుతామన్న మాట నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. తాగునీటిని అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మంజీరాం డ్యాంలో శంకుస్థాపన జరిగిందన్నారు. మంత్రిగా హరీష్‌రావు ఇష్టమొచ్చినట్లు, ప్రజలంటే లెక్కలేదనే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన నిర్ణయాలతో ఇప్పుడు సంగారెడ్డి ప్రజలు తాగునీటికోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సింగూరు, మంజీరా డ్యాంలలో నీరు తరలించిన హరీష్‌రావు తక్షణమే సంగారెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. డ్యాంలలో వెంటనే నీటిని నింపాలని, డ్యాంలలో నీటిని నింపేవరకు ఈ నెల 18 నుంచి శాసన సభ్యుడిగా నేనే, నా భార్య నిర్మల ఇద్దరం సంగారెడ్డి మండల కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఏ హక్కుతో నీళ్లు తీసుకోని పోయావో.. మళ్లీ మా నీళ్లు మాకు నీళ్లు మాకు తరలించాల్సిందే.. అప్పటి వరకు సంగారెడ్డి హెడ్ క్వార్టర్‌లో దీక్షలు, ఆందోళనలు కొనసాగుతాయని జగ్గారెడ్డి హెచ్చరించారు. సీఎం స్పందించి ఈ పొరపాటు ఎందుకు జరిగింది జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకోవాలని, గతంలో హరీష్‌రావు చేసిన తప్పుడు విధానాన్ని చక్కదిద్ది సంగారెడ్డి ప్రజలకు తాగునీరు అందించేలా సింగూరు, మంజీరా డ్యాంలలో నీటిని నింపాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. తాము శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తామని, దీక్ష కోసం ఇప్పటికే డీఎస్పీని అడిగామన్నారు. తాము ఎలాంటి ఆందోళనలు లేకుండా శాంతియుతంగా దీక్ష చేస్తామని, అలా కాకుండా అవసర రద్దాంతం సృష్టిస్తే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జగ్గారెడ్డి అన్నారు. ఈ విషయంలో అవసరమైతే సీఎం కేసీఆర్‌ను కలిసి మంత్రి ¬దాలో హరీష్‌రావు చేసిన తప్పిదాన్ని తెలియజేస్తానని అన్నారు.
సింగూరు జలాలపై కేసీఆర్ స్పందించాలి




