సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవా ల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగ రాదు.
-జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్.
-15 కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం పనులను త్వరలో ప్రారంభిస్తాం.
-బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలి.
-కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్29(జనంసాక్షి):
ప్రాచీన పురాతనమైన ఆలయంగా తెలంగాణ రాష్ట్రంలో రెండవ యాదాద్రిగా పేరుగాంచిన సింగోటం శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
సింగోటం లక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం సింగోటం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఇప్పటివరకు చేసిన ఏర్పాట్ల పై కలెక్టర్ సమీక్షించి అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జనవరి 15వ తేదీ నుండి జనవరి 21వ తేదీ వరకు జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇది వరకే ఆదేశించినట్లుగా ఆయా శాఖల అధికారులు వారికి కేటాయించిన విధులను తూ.చా తప్పకుండా నిర్వర్తించాలని, నిర్లక్ష్యం వహించవద్దని కోరారు.16వ తేదీన నిర్వహించే స్వామివారి కళ్యాణోత్సవం, 17వ తేదీన నిర్వహించనున్న ప్రభోత్సవం,19వ తేదీన నిర్వహించనున్న తెప్పొత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. పార్కింగ్, లైటింగ్ ,సీసీ కెమెరాల ఏర్పాటు వంటి వాటిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఓవర్ లోడ్ వల్ల అంతరాయం తలెత్తకుండా ఏర్పాటు చేయాలని ట్రాన్స్కో ఎ ఈ ని ఆదేశించారు.వైద్య ఆరోగ్యశాఖ తరఫున ప్రాథమిక చికిత్స ఏర్పాట్లతో పాటు, 108 అంబులెన్స్, ఇతర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య లోపం లేకుండా శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిపిఓను ఆదేశించారు.రహదారుల వెంట ప్రమాదాలకు ఆస్కారం లేకుండా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి శాఖను ఆదేశించారు.
కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండవ యాదాద్రిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని, భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వహించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అధికారులను సూచించారు.
ఆరు రోజులు నిర్వహించే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహోత్సవాలు భక్తులు ఇబ్బంది లేకుండా ఘనంగా నిర్వహించాలన్నారు. జాతరలో రథోత్సవానికి లక్షల సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని కాబట్టి ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు.
మన రాష్ట్రంలోనే అతి పెద్ద జాతరగా పేరొందిన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో 15 కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు.ఆగమ శాస్త్ర నియమ నిబంధనల ప్రకారం ఆలయం పునర్నిర్మాణ పనులు చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ ఆర్డీవో హనుమాన్ నాయక్, ఆలయ ట్రస్ట్ మరియు చైర్మన్ రాజా ఆదిత్య లక్ష్మణరావు, ఆలయ ఏవో, ఇతర ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




