Wednesday, 4 November 2026

సింగ‌రేణి సోలార్ విద్యుత్ ఉత్పాద‌న‌లో మ‌రో కొత్త మైలురాయి.

సింగ‌రేణి సోలార్ విద్యుత్ ఉత్పాద‌న‌లో మ‌రో కొత్త మైలురాయి…….

సంక్రాంతి నాటికి తొలి 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ప్రారంభం………

మార్చి నాటికి మ‌రో 10 మెగావాట్ల ఫ్లోటింగ్ ప్లాంట్ ప్రారంభానికి స‌న్నాహాలు…….

మూడో ద‌శ‌లోని 81 మెగావాట్ల ప్లాంట్లు జులై చివ‌రి క‌ల్లా పూర్తి చేయాలి……

సింగ‌రేణి విద్యుత్ స‌మీక్షా స‌మావేశంలో సంస్థ ఛైర్మ‌న్, ఎండీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్…..

సింగరేణి కాలరీస్ కంపెనీ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి రంగంలో మరో కొత్త మైలురాయిని త్వరలో దాటనుంది. మంచిర్యాల జిల్లా లోని సింగరేణి థ‌ర్మ‌ల్‌ విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో తొలిసారిగా నిర్మించిన 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్‌ ప్లాంటును ఈనెల 15వ తేదీన‌ ప్రారంభించ‌నున్నారు. హైదరాబాద్ సింగ‌రేణి భ‌వ‌న్ లో శుక్రవారం నిర్వహించిన విద్యుత్ సమీక్ష సమావేశంలో సంస్థ ఛైర్మ‌న్ మ‌రియు ఎండీ ఎన్.శ్రీ‌ధ‌ర్‌ ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సింగరేణి కాలరీస్ గత రెండేళ్ల కాలంలో 8 చోట్ల 219 మెగావాట్ల సామర్ధ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్లు ఇప్ప‌టి వ‌ర‌కు 505 మిలియ‌న్ యూనిట్ల విద్యుత్‌ను విజయవంతంగా ఉత్ప‌త్తి చేశాయి. త‌ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు కంపెనీకి 300 కోట్ల రూపాయ‌ల ఆదా జ‌రిగింది.

కాగా, మూడో ద‌శ సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో భాగంగా సింగ‌రేణి సంస్థ సింగ‌రేణి థ‌ర్మ‌ల్‌ విద్యుత్ కేంద్రంలో గల మూడు టీఎంసీల రిజర్వాయర్ నీటి పై 15 మెగావాట్ల సామ‌ర్థ్యంతో రెండు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల‌ ను నిర్మించ‌త‌ల‌పెట్టింది. వీటిలో తొలి దశలో నిర్మించిన 5 మెగావాట్ల ప్లాంటును ఈ సంక్రాంతి లోపు ప్రారంభించాలని సంస్థ ఛైర్మ‌న్ మ‌రియు ఎండీ ఆదేశించగా దీనికోసం డైరెక్టర్(ఈ అండ్ ఎం) డి.స‌త్య‌నారాయ‌ణ‌రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, అదే రిజర్వాయర్ పై నిర్మాణంలో ఉన్న మ‌రో 10 మెగావాట్ల ప్లాంట్ ప‌నుల‌ ను కూడా శ‌ర వేగంగా పూర్తి చేయాల‌ని, మార్చి నాటికల్లా ఈ ఫ్లోటింగ్ ప్లాంట్‌ను కూడా ప్రారంభించాల‌ని సంస్థ ఛైర్మ‌న్‌ స్ప‌ష్టం చేశారు. వీటితోపాటు మూడో దశలో నిర్మించే మరో 66 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు ప్లాంట్లను కూడా ఈ ఏడాది జులై నాటికి పూర్తి చేయాలని ఛైర్మన్ ఆదేశించారు. ఇప్ప‌టికే మొద‌టి రెండు ద‌శ‌ల్లో 219 మెగావాట్ల ప్లాంట్ల‌ను పూర్తి చేసిన సింగ‌రేణి మూడో ద‌శ ప్లాంట్ల‌ను కూడా పూర్తి చేస్తే మొత్తం 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ను ఉత్ప‌త్తి చేసిన‌ట్టు అవుతుంది.

అలాగే సింగ‌రేణి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ ప‌నితీరును స‌మీక్షించిన ఆయ‌న అత్య‌ధిక పీఎల్ఎఫ్ తో దేశంలో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌వ‌డం అభినంద‌నీయ‌మ‌ని, ఇదే స్థాయిలో ఇక‌ముందు కూడా మంచి పీఎల్ఎఫ్ సాధిస్తూ రాష్ట్ర విద్యుత్ అవ‌స‌రాలు తీర్చ‌డంలో ముందుండాల‌ని ఆదేశించారు.

ఈ స‌మీక్షా స‌మావేశంలో డైరెక్ట‌ర్ (ఈ అండ్ ఎం) డి.స‌త్య‌నారాయ‌ణ రావు, జీఎం(కో ఆర్డినేష‌న్‌) ఎం.సురేశ్‌, చీఫ్ టెక్నిక‌ల్ క‌న్స‌ల్టెంట్ ఎస్‌.కె.సుర్‌, చీఫ్ (ఓ అండ్ ఎం) జె.ఎన్‌.సింగ్‌, జీఎం(ఎస్టీపీపీ) డివి.ఎస్‌.ఎస్‌.ఎన్‌. రాజు, జీఎం(సోలార్‌) ఎస్‌.జాన‌కీ రామ్‌, చీఫ్ ( ఈ అండ్ ఎం) ఎన్‌.వి.కె.విశ్వ‌నాథ రాజు, జీఎం( సివిల్‌) సీహెచ్‌.ర‌మేశ్ బాబు, ఏజీఎం టి.సుధాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.