బెల్లంపల్లి, మే 27, (జనంసాక్షి )తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సిఓఈ, బెల్లంపల్లి మరోసారి జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. సిఓఈలో యంపిసి ద్వితీయ సంవత్సరం విద్యార్థి పంచెర్పుల శ్రీనివాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ ద్వారక, న్యూఢిల్లీ లో సీటు సాధించాడు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎయంఈ సెట్ 2023) ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించి క్వాలిఫై అయిన శ్రీనివాస్ కు శుక్రవారం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ ద్వారక (న్యూఢిల్లీ) లో సీటు లభించినట్లు అడ్మిషన్ కార్డు అందుకున్నట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు.
– అభినందనల వెల్లువ
జాతీయస్థాయిలో 3664 ర్యాంకు సాధించడమే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐఏఈ న్యూడిల్లీ లో సీటు సాధించిన శ్రీనివాస్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి, డిసిఓ రామల బాల భాస్కర్ లు అభినందించారు.
ఈసందర్భంగా జాయింట్ సెక్రటరీ కంభంపాటి శారద ప్రత్యేకంగా ఫోన్ ద్వారా శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. గురుకులాల్లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ లో సీటు సాధించిన తొలి విద్యార్థిగా ఖ్యాతి పొందడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అరుదైన, అత్యున్నతమైన కోర్సులకు విద్యార్థులు ఎంపికయ్యేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్న అధ్యాపకులను ఎమ్మెల్యే చిన్నయ్య అభినందించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ కు ప్రిన్సిపల్ ఐనాల సైదులు అధ్యాపకులు చందా లక్ష్మీనారాయణ, సుంకరి అర్జున్, నాగిని శ్రీరామ వర్మ, మిట్ట రమేష్, కట్ల రవీందర్, సురేష్ గౌడ్, అనుముల అనిరుద్, గాజుల రాజేందర్, ఆకేనేపల్లి రాజేష్, యండి లతీఫ్, అవునూరి రవి , సిబ్బంది ఐ మల్లేష్, సమెందర్ తదితరులు అభినందనలు తెలిపారు.




