Thursday, 5 November 2026

సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్‌ మాల్‌లో ఎగసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరిధి నల్లగుట్టలోని షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నల్లగుట్టలోని డెక్కన్‌ నైట్‌ వేర్‌ స్పోర్ట్స్‌ మాల్‌లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి షాపింగ్‌మాల్‌ మొత్తానికి విస్తరించడంతో మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. పక్కనున్న మరో భవనానికి మంటలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు.
కాగా, భవనంపై చిక్కుకున్న ముగ్గురిని రక్షించారు. భారీ క్రేన్‌ సహాయంతో వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. కాగా, బిల్డింగ్‌లోనుంచి దట్టంగా పొగ వెలువడుతుండటంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతున్నది. భవనం పక్కనున్న నివాసాలకు పొగలు వ్యాప్తిచెండటంతో ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.