గద్వాల నడిగడ్డ, మే 20 (జనం సాక్షి) :జిల్లా స్థాయిలో నిర్వహించే సి ఎం కప్ 2023 క్రీడా పోటీలు టైం ప్రకారం ప్రాపర్‌గా ఆటలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.
శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం కప్ 2023 ఈ నెల 22 నుండి 24 వరకు పోటీలు నిర్వహించడం జరగుతుందని , సీఎం కప్ 2023 క్రీడా పోటిలకు సంబంధించి పి ఈ టి లు, అధికారులు సమన్వయ చేసుకొని పోటీలు నిర్వహించాలని, అధికారులు క్రీడలకు సంబంధించి స్థలాలను ముందే చెక్ చేసుకోవాలని , ఏదైనా అవసరమైతే సమాచారం ఇవ్వాలని తెలిపారు.పి ఈ టి లను ఇన్చార్జిలుగా,అధికారులను సూపర్వైజర్లు గా నియమించలన్నారు. మొదటి రోజు వాలీబాల్ కార్యక్రమాలతో ప్రారంభిస్తామని తెలిపారు. వాలీబాల్ ప్రారంభం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయించాలని , వేసవికాలం ఉన్నందున ఉదయం 7 గంటలకు మొదలుపెట్టి మళ్లీ తిరిగి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే విధంగా ప్లాన్ చేసుకోవాలన్నారు. క్రీడలకు సంబంధించి ఆటలవారీగా ఎన్ని టీం లు వచ్చాయో అని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రీడా పోటీల్లో ఎక్కువ మంది పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని,ఆటలు నిర్వహించే ప్రాంతాల్లో త్రాగు నీరు ,అరటిపళ్ళు ,ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు , గ్లూకోస్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతులకు సంబంధించి సర్టిఫికెట్లు , మేమోంటోలు సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు. జూనియర్ కళాశాల నుంచి గర్ల్స్, బాయ్స్ ఎక్కువ మొత్తంలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సి ఎం కప్ 2023 కి సంబంధించి అథ్లెటిక్స్, ఫుట్ బాల్, కబడి , కోకో, వాలిబాల్, బాస్కెట్ బాల్, స్విమింగ్, రేజిలింగ్,బ్యాడ్మింటన్ వంటి పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 12 మండలాల్లో ఈ పోటీలు నిర్వహించడంతో పాటు పోటీలకు కోచ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, మండల స్థాయి లో గెలుపొందిన వారు జిల్లా స్థాయి లో పాల్గొంటారని,మహిళలు , పురుషులు ఈ క్రీడా పోటిలలో 100 శాతం పాల్గొనే విధంగా చూడాలన్నారు.జిల్లా స్థాయి లో గెలుపొందిన వారిని హైదరాబాద్ గచ్చిబౌలి, లాల్ బహదూర్ స్టేడియం కు పంపించాలన్నారు.
ఈ సమావేశంలో స్పోర్ట్స్ అధికారి రమేష్ బాబు, పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు,డి ఈ ఓ సిరాజుద్దీన్ , మున్సిపల్ కమిషనర్ నరసింహ , ఎస్సీ కార్పొరేషన్ అధికారి శ్వేత ప్రియదర్శిని,స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి ముసాయిదా బేగం గోవిందయ్యా, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కప్ 2023 క్రీడా పోటీలకు టైం ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి




