Wednesday, 4 November 2026

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల 

– ఈ ఏడాది 83.03శాతం 
– గతేడాదికంటే పెరిగిన ఉత్తీర్ణతశాతం
హైదరాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం పెరిగింది. 2017లో 82.02 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ ఏడాది 83.03 శాతం నమోదైంది. త్రివేండ్రం రీజియన్‌ 97.32 శాతం ఉత్తీర్ణతతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 93.87శాతం ఉత్తీర్ణతతో చెన్నై రీజియన్‌ రెండో స్థానంలో ఉండగా.. 89శాతం ఉత్తీర్ణతతో ఢిల్లీ మూడోస్థానం దక్కించుకుంది. ఈఏడాది ఫలితాల్లోనూ బాలికలేపై చేయి సాధించారు. బాలికలు 88.31 శాతం మంది ఉత్తీర్ణులవగా.. బాలురు 78.99 శాతం మంది పరీక్షలు పాసయ్యారు. జియాబాద్‌కి చెందిన మేఘనా శ్రీవాస్తవ 500కిగానూ 499 మార్కులతో టాపర్‌గా నిలవగా..అనౌనుష్క చంద్ర (498) రెండో ర్యాంకు దక్కించుకున్నారు. మూడోస్థానంలో ఏడుగురు విద్యార్థులు సంయుక్తంగా నిలవడం విశేషం. విదేశాల్లో 15,674 మంది విద్యార్థుల పరీక్షలు రాయగా.. 14,881 మంది (94.94 శాతం) ఉత్తీర్ణత సాధించారు. మనదేశంలో నమోదైన ఉత్తీర్ణత కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చి 5-ఏప్రిల్‌ 13 తేదీల మధ్య నిర్వహించిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 11.86 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పేపర్‌ లీక్‌ కావడంతో ఎకనమిక్స్‌ పరీక్షను మరోసారి నిర్వహించడంతో ఈ ఏడాది ఫలితాల విడుదల ఆలస్యం అవుతుందేమోనని విద్యార్థులు ఆందోళన చెందారు. కానీ నిర్ణీత సమయానికే బోర్డు రిజల్ట్స్‌ను ప్రకటించింది.