– నాలుగు రోజుల క్రితమే బస్సులను నిలిపివేసిన అధికారులు
– అధికారుల ముందస్తు చర్యలతో తప్పిన ప్రమాదం
హైదరాబాద్, జులై5(జనం సాక్షి) : గౌలిగూడలోని పాత సీబీఎస్ బస్టాండ్ పైకప్పు కుప్పకూలిపోయింది. అయితే ఆర్టీసీ అధికారుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్ షెడ్ కూలిపోయే స్థితిలో ఉన్నట్లు నాలుగు రోజుల క్రితమే అధికారులు గుర్తించారు. దీంతో ముందస్తు చర్యగా అధికారులు బస్సులను లోపలికి అనుమతించలేదు. బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రయాణికులను కూడా అప్రమత్తం చేశారు. చివరకు గురువారం తెల్లవారు జామున భారీ శబ్దంతో షెడ్ కుప్పకూలింది. 88 సంవత్సరాలుగా సీబీఎస్ బస్టాండ్ ప్రజలకు ఎంతో సేవలందించింది. ఉమ్మడి రాష్ట్రాల తొలి బస్‌స్టేషన్‌గా పేరుగడించింది. బస్టాండ్‌లో మొత్తం 36 ఫ్లాట్‌ఫాంలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ఠాల్ర ప్రయాణికులు కూడా ఈ బస్టాండ్ నుంచే రాకపోకలు సాగించే వారు. కాగా 8దశాబ్దాల చరిత్ర ఉన్న షెడ్ శిథిలావస్థకు చేరుకోవడంతో అక్కడి నుంచి ఎలాంటి రాకపోకలు జరపకుండా ఖాళీ ఉంచారు. ఇమ్లిబన్ బస్టాండ్ నిర్మించిన అనంతరం బస్సులను అక్కడకు మార్చారు. కాగా బస్సుల అవసరాల కోసం పాతబస్టాండ్‌కు మరమత్తులు చేసి సిటీ బస్సులకు అనుమతినిచ్చారు. అయితే నాలుగు రోజుల క్రితం బస్టాండ్ పూర్తి శిథిలావస్థకు చేరుకుందని ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సిటీ బస్సులను, ప్రయాణికులను అందులోకి అనుమతించలేదు. ఆర్టీసీ అధికారులు ఊహించిన విధంగానే షెడ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. భారీ శబ్ధంతో కుప్పకూలడంతో అక్కడున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. లోపల ఎవరూ లేకపోవడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. పురాతనమైన షెడ్ కుప్పకూలిన విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు తరలివచ్చారు. ఇదిలా ఉంటే విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు అక్కడకు చేరుకొని దగ్గరుండి శిథిలాలను తొలగింపజేశారు. త్వరలో మరమ్మతులు నిర్వహించి అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
సీబీఎస్ బస్టాండ్‌లో కుప్పకూలిన షెడ్




