సుతిలి సప్లయి తగ్గి వ్యాపారులు బ్లాక్ చేయడం వల్లే డిమాండ్ ఏర్పడి ఖర్చు పెరిగింది
– మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
జనంసాక్షి , మంథని : ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహామ్మారి వల్ల దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించి ప్రజలెవరూ బయటికి రాని సమయంలోనూ సహకార సంఘం ద్వారా వరి ధాన్యం కొనుగోలు నిర్వహించి రైతులకు అండగా నిలిచామని మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం వివిధ దినపత్రికల్లో సహకార సంఘంలో సుతిలి కొనుగోలు లో అవినీతి జరిగిందంటూ వచ్చిన కథనాలకు ఆయన స్పందించారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ.. 2020 ఫిబ్రవరి 15న తమ పాలకవర్గం ఏర్పడే నాటికి సహకార సంఘం ఆధ్వర్యంలో (15) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించగా, తాము బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు అట్టి సంఖ్యను 30, 34 కేంద్రాలకు పెంచుకోవడంతో పాటు సంఘ వ్యాపారాన్ని రెట్టింపు చేయడం జరిగిందని తెలిపారు. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు ఏ మాత్రం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గ్రామగ్రామాన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అసౌకర్యం కలగకుండా చూశామన్నారు. వరి ధాన్యం కొనుగోలు వ్యాపారంలో తమ సంఘం పెద్దపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా 3లక్షల 50వేల క్వింటాళ్లకు పై చిలుకు వరి ధాన్యం కొనుగోలు చేస్తూ తమ సంఘం ప్రథమ స్థానంలో నిలుస్తుందని అన్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల మూడు సంవత్సరాల పాటు వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. జూట్ మిల్లుల్లో ఉత్పత్తి బందై పశ్చిమ బెంగాల్ నుంచి వ్యాగన్ల ద్వారా వచ్చే సుతిలి సరఫరా నిలిచిపోయిందని, తద్వారా సప్లయి తగ్గి డిమాండ్ పెరిగిందని, దీన్ని అదనుగా భావించిన వ్యాపారస్తులు అప్పటికే తమ వద్ద ఉన్న సుతిలిని బ్లాక్ చేసి సుతిలి బ్యాగు రూ.3500కు లభించేదానిని రూ.7 వేల నుంచి రూ.8వేల వరకు విక్రయించడం వలన సుతిలి కొనుగోలు ఖర్చు పెరిగిందని తెలిపారు. అంతేగాని సుతిలి కొనుగోలులో ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి జరుగలేదని పేర్కొన్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల జూట్ పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గిపోవడం, దుకాణాలు మూసి ఉండటం, కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన ముఖ్యమైన వనరులైన సుతిలి లభించకపోవడంతో అధిక వ్యయం చేయాల్సి వచ్చిందని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ కోసం కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తమ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నారని, ఇదంతా ప్రజలు రైతులు గమనించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ జిల్లా ఉన్నతాధికారులు, మిల్లర్లతో మాట్లాడి కరోనా లాంటి విపత్కర పరిస్థితిల్లోనూ రైతులకు ఒక్క గింజ కోత విధించకుండా చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులు సహకార సంఘం అభివృద్ధిని చూసి ఓర్వలేకనే సంఘంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గతంలో కూడా కొందరు నాయకులు సంఘంపై ఫిర్యాదులు చేయగా, ఆ తదుపరి అన్ని సక్రమంగానే ఉన్నాయని అంగీకరించడం జరిగిందని తెలిపారు. అంతేగాని సహకార సంఘంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరుగ లేదని తెలిపారు.




