సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి

– అన్ని శాఖల్లో మన కృషి ఫలిస్తోంది
– శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లిస్తాం
– ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకోవాలి
– లోటు వర్షపాతం ప్రాంతాల్లో రెయిన్‌గన్స్‌ వాడండి
– వ్యాధులు ప్రబలకుండా అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలి
– అధికారుల టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు సూచన
అమరావతి, జులై23(జ‌నంసాక్షి) : ఏపీ అభివృద్ధిలో అధికారుల కృషి అమోఘమని, ఇదే స్ఫూర్తితో మున్ముందు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి సుస్థిర అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సోమవారం నీరు-ప్రగతి, వ్యవసాయంపై సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  ఆంధప్రదేశ్‌ కోసం అక్కడ పార్లమెంటులో ఎంపీలు పోరాటం చేస్తున్నారని… ఇక్కడ అభివృద్ధి కోసం అధికార యంత్రాంగం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణానదిలోకి ఇప్పుడిప్పుడే నీరు వస్తోందని, గోదావరిలో ఇప్పటికే 419టీఎంసీలు సముద్రంలో కలిసిందని తెలిపారు. వంశధార, నాగావళికి వరద ప్రవాహం పెరిగిందన్నారు. అలాగే మరో పదిరోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్‌ నిండుతుందని అన్నారు. మంగళవారం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటి విడుదల చేస్తామని, వచ్చే ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేయాలని అధికారులకు సూచించారు. భూమినే జలాశయంగా మార్చుకోవాలన్నారు. గోదావరి జలాలతో కృష్ణా ఆయకట్టుకు నీళ్లిచ్చామని, అలాగే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లిస్తామని సీఎం తెలిపారు. అన్నిశాఖల్లో మన కృషి ఫలిస్తోందని, సుస్థిర ఆర్ధికాభివృద్ధే మన లక్ష్యం కావాలని సూచించారు. నాలుగేళ్లలో వ్యవస్థలను పటిష్టంగా నిర్మించామని, సమర్ధంగా వ్యవస్థలను వినియోగించుకోవాలన్నారు. వనరులు ఉన్నాయని, నిధులు సవిూకరిస్తున్నామని తెలిపారు. రాయలసీమలో వర్షాభావ పరిస్థితి ఉందని సీఎం పేర్కొన్నారు. లోటు వర్షపాతం ప్రాంతాలలో రెయిన్‌ గన్స్‌ వాడాలని సూచించారు. రెయిన్‌ గన్‌, జిబా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సకాలంలో మార్కెట్‌ జోక్యానికి తోతా మామిడి ఉదాహరణగా పేర్కొన్నారు. ఇప్పటివరకు లక్ష టన్నుల మామిడిని సేకరించామని, ప్రభుత్వ స్పందనపై రైతుల్లో పూర్తిస్థాయిలో సంతృప్తి నెలకొందని అధికారులకు తెలియజేశారు. రేగాలో లేబర్‌ కాంపోనెంట్‌ లక్ష్యం చేరుకున్నామన్నారు. మెటీరియల్‌ కాంపోనెంట్‌ లక్ష్యం పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. పంటకుంటలు, సిమెంట్‌ రోడ్ల నిర్మాణం ముమ్మరం చేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, వ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2018లో అవార్డులు ఏపీనే సాధించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

తాజావార్తలు