బాబుతో గొట్టిముక్కల పద్మారావు భేటీ
నేటి నుంచి కూకట్‌పల్లిలో ప్రచారానికి సుముఖత
హైదరాబాద్,నవంబర్27(జనంసాక్షి): నందమూరి బిడ్డను భారీ మెజారిటీతో గెలిపించాలని కూకట్‌పల్లి ప్రజలను ఏపీ మంత్రి పరిటాల సునీత కోరారు. కూకట్‌పల్లి తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగామంత్రి పరిటాల సునీత ప్రచారం నిర్వహించారు. కూకట్‌పల్లిలో సుహాసినితో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. సుహాసిని మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పరిటాల సునీత అన్నారు. కుకట్‌పల్లి తెదేపాకు కంచుకోట అని.. ఆమె గెలుపు కోసం అందరూ ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ సమస్యలు, మహిళల కష్టాల పరిష్కారంలో సుహాసిని ముందుంటారనే నమ్మకం అందరికీ ఉందని వెల్లడించారు. నందమూరి తారకరామారవు మనవరాలు అయిన సుహాసినిని గెలపించాలన్నారు. ఇదిలావుంటే టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన కూకట్‌పల్లి నేత గొట్టిముక్కల పద్మారావు టీడీపీలో చేరబోతున్నారు. ఆయన విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. బుధవారం నుంచి నందమూరి సుహాసిని గెలుపు కోసం గొట్టిముక్కల ప్రచారం చేయనున్నారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన విషయం గురించి మాట్లాడుతూ.. పార్టీని తన ఇల్లులా, కేసీఆర్‌ను తన తండ్రిలా భావించానని వ్యాఖ్యానించారు. తనతోపాటు చాలామందికి పార్టీలో తీరని అన్యాయం జరిగినా ఓపికగా మార్పుకోసం ఎదురుచూశానన్నారు. కేసీఆర్ తెలంగాణ వాదాన్ని పూర్తిగా మరిచి పోయారని, పార్టీ పక్కదారి పడుతోందని, ఇప్పట్లో గాడిలో పడే పరిస్థితి కనిపించడం లేదని భావించి తన క్రియాశీలక సభ్యత్వానికి, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.
తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తున్న 13 స్థానాల్లో కూకట్‌పల్లి స్థానంపై ప్రజల్లో ఎక్కువ ఆసక్తి నెలకొంది. హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని ఈ స్థానం నుంచి పోటీ చేస్తుండటం అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. మరోపక్క ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్ కూడా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ ఇంచార్జ్ గొట్టిముక్కల పద్మారావు టీఆర్‌ఎస్‌ని వీడటం
ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన గత ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి పోటీ చేసి మాధవరం కృష్ణారావు చేతిలో ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్‌ను వీడిన పద్మారావు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న ఆయన సుహాసిని తరపున ప్రచారం చేస్తానని తెలిపారు.
సుహాసినికి మద్దతుగా పరిటాల సునీత ప్రచారం




