జనంసాక్షి , మంథని : వివిధ పండుగల సమయంలో ప్రజలకు తమవంతు సేవ అందించేలా సామాజిక సేవలో ప్రతి ఒక్కరు బాగస్వాములు కావాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంథని గోదావరినది తీరంలోని గౌతమేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాల పంపిణీని ఆయన ప్రారంభించారు. అలాగే రేనా ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిభిరంలోఆయన పాల్గొని వైద్య పరీక్షలుచేయించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్బంగా ఉపవాసం చేసే భక్తుల ఆకలికి కొంత ఉపశమనం కల్పించేలా ఆలయ ప్రాంగణంలో పాల పంపిణీకి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యులు గొప్ప మనస్సున్న మహరాజులని, కరోనా విపత్కర పరిస్థితుల్లో అనేక సేవలు అందించి ప్రజలకు అండగా నిలిచారని, అలాగే వివిధ పండుగలు, పర్వదినాల సందర్బంగా భక్తులకు అనేక ఏండ్లుగా సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. గౌతమేశ్వర ఆలయ పాలకమండలి సభ్యులు కలిసి కట్టుగా ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఎంతో కృషి చేస్తున్నారని, పాలక మండలి గొప్పగా పనిచేయడం మూలంగానే దాతలు ముందుకు వచ్చి తమవంతు సాయం అందిస్తున్నారని ఆయన తెలిపారు. మంథనికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త సుదర్శన్, సీతారామ సేవా సదన్లాంటి సంస్థలు ముందుకు వచ్చి ఆలయాల అభివృధ్దికి సహకారం అందిస్తూ సేవా స్పూర్తిని చాటుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. అత్యంత వైభవంగా జరుపుకునే తొలిఏకాదశి సందర్బంగా నియోజకవర్గ ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలను ఆయన ఈ సందర్బంగా తెలిపారు.
సేవా స్పూర్తిని చాటుకోవడం అభినందనీయం – జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్




