Tuesday, 3 November 2026

స్థలంలేని పేదవారికి స్థలం ఇల్లు కల్పించాలి- సిపిఎం

పెనుబల్లి, జూన్ 26(జనం సాక్షి)ఇండ్ల స్థలం లేని పేదవారికి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మాచర్ల భారతి అన్నారు. సిపిఎం పార్టీ పెనుబల్లి మండలం జనరల్ బాడీ సమావేశం సోమవారం మండల నాయకులు కండి సత్యం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహ లక్ష్మీ పథకం ద్వారా మూడు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఇంటి నిర్మాణం కోసం ఇవి ఏ మేరకు సరిపోతాయని ఆమె పేర్కొన్నారు. స్థలం లేని నిరుపేద కుటుంబాలకు జాగాలేకుండా గృహలక్ష్మి పథకం ఏ రకంగా అమలు జరుపుతారని ప్రశ్నించారు. గ్రామాల్లో కుటుంబాలు నానాటికి పెరుగుతున్న నేటికీ ఒక ఇండ్ల స్థలం కూడా ప్రభుత్వం కేటాయించకపోవడం శోచనీయమన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మండలంలో పోడు భూమి చేసుకున్న ప్రతి కుటుంబానికి పాసు పుస్తకం అందజేసి రైతుబంధు వర్తించేలా చూడాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం వ్యవసాయంతో అనుసంధానం చేసి 200 రోజులు పని కల్పించాలని కనీస వేతనం అమలు చేయాలని అన్నారు. జులై మొదటి వారం నుండి నియోజకవర్గంలో రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని వాటిని జయప్రదం చేసేందుకు పార్టీ కార్యకర్తలు కార్యాచరణ ప్రారంభించాలన్నారు. జిల్లా కమిటీ సభ్యులు చలమాల విటల్ రావు, సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, చలమాల నరసింహారావు, గుడిమెట్ల బాబు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.