
హైదరాబాద్: నాగర్‌కర్నూల్ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.భారాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఉప్పల్ స్కైవాక్ టవర్‌ను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు.”నిన్న సభలో నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడిపోయారు. కేసీఆర్‌ను జైల్లో పెడతామంటున్నారు.. అది ఎందుకో చెప్పాలి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అందిస్తున్నందుకా? కేసీఆర్ కిట్లు, రెండు పడక గదుల ఇల్లు ఇస్తున్నందుకా? కేసీఆర్‌ను ఎందుకు జైలుకు పంపుతావ్? మాట్లాడడానికి ఓ హద్దు అదుపు ఉండాలి. ఈ 23 ఏళ్లలో కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదు” అని కేటీఆర్ ధ్వజమెత్తారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కష్టాలు ఉన్నాయని.. ప్రస్తుతం 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి చెప్పారు. వేసవి కాలంలో నీటి కొరత సమస్య లేకుండా ఇబ్బందులను సీఎం కేసీఆర్ పరిష్కరించారన్నారు. నారపల్లి నుంచి ఉప్పల్ వరకు రహదారి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నాలుగేళ్ల నుంచి రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఆరోపించారు.




