బిచ్కుంద మే 04 (జనంసాక్షి)కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక, పంచవర్ష ప్రణాళికలను సిద్ధం చేసి గ్రామాలను అభివృద్ధి చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ నిధులకు తోడు.. మరిన్ని నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో పచ్చదనం పరిశుభ్రతకు ప్రభుత్వాలు పెద్దపీట వేసాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని లక్షల రూపాయల నిధులు కేటాయిస్తే కొందరు సర్పంచులు తూతూ మంత్రంగా పనులు చేసి బిల్లులు పెట్టి డబ్బులు స్వాహా చేస్తున్నారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2020 – 2021 సంవత్సరంలో బిచ్కుంద మండలంలో గల మొత్తం 27 పంచాయతీలకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 7కోట్ల 66 లక్షల 26 వేల 790 రూపాయల నిధులు విడుదల చేసింది. అదేవిధంగా 2021 – 2022 సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు గాను 5 కోట్ల 62 లక్షల 7 వేల 923 రూపాయల నిధులు మంజూరు చేసింది. కానీ కొందరు సర్పంచులు మాత్రం లక్షల రూపాయల నిధులు కాజేశారని జనం గుసగుసలాడుతున్నారు.




