హుజూర్ నగర్ ఏప్రిల్ 8 (జనం సాక్షి): విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విఫలం అయిందని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు అన్నారు. శనివారం సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బిజెపి హటావో దేశ్ కి బచావోలో భాగంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. బయ్యారం ఉక్కు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు లాంటి విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు, ఆదాని, అంబానీ లాంటి వ్యక్తులకు కట్ట పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందన్నారు. తెలంగాణకు కొంగు బంగారమైన బొగ్గు గనులను సింగరేణికి కాకుండా ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తుందన్నారు. ఇలాంటి పన్నాగాలను తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని మోడీ గో బ్యాక్ నినాదాలతో ఉద్యమించి తగిన గుణపాఠం నేర్పుతారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, దొంత గాని సత్యనారాయణ, యల్లావుల రమేష్, జక్కుల రమేష్, బాదే నరసయ్య, జక్కుల శ్రీను, కె బక్కయ్య, బత్తిని మల్లయ్య, జక్కుల రమణ పాల్గొన్నారు




