– ప్రజాస్వామ్యానికి ఇది శుభపరిణామం
– వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్, మార్చి29(జనంసాక్షి) : ఈసీ ఆదేశాలను ధిక్కరించిన చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిందని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. హైకోర్టు తీర్పు అనంతరం వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఈసీ ఆదేశాలను ధిక్కరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తే ఈసీకి వ్యతిరేకంగా జీవో ఇచ్చి చంద్రబాబు సాధించిందేమిటని ఆమె ప్రశ్నించారు. వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న ఇంటెలిజెన్స్ చీఫ్, ఇద్దరు ఎస్పీలను ఈసీ బదిలీ చేసిందని, ఈ విషయంపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటన్నారు. సీఈసీని విమర్శించిన తీరు ఇంతకు ముందెన్నడూ చూడలేదన్నారు. ఈసీ ఆదేశాలకు చంద్రబాబు అడ్డుపడినా నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి శుభపరిణామమన్నారు. అలాగే చంద్రబాబుకు ఇది ఘోర అవమానమని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈసీ అధికారులను బదిలీ చేస్తే పెద్ద రాజకీయ కుట్రగా చంద్రబాబు చిత్రీకరించారని, ఇందుకు ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.
హైకోర్టు తీర్పు బాబుకు చెంపపెట్టు




