– జనవరిలోగా మన హైకోర్టు మనకు వస్తుంది
– కొత్త జిల్లాల్లో డిస్టిక్ట్ర్ కోర్టులు ఏర్పాటు చేస్తాం
-న్యాయవ్యవస్థలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
– ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, నవంబర్21(జనంసాక్షి) : ఎన్టీఏ ప్రభుత్వంలో నాలుగేళ్లు భాగస్వామిగా ఉండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైకోర్టు విభజనను అడ్డుకున్నాడని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఆన్నారు. అంబర్‌పేట్‌లో బుధవారం జరిగిన అడ్వకేట్ ఫర్ టీఆర్ఎస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమానికి పైకి కనపడే ఒక మకుటం టీఆర్ఎస్ అని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ బిడ్డలు వెన్నుదన్నుగా నిలిచారని.. కులాలు, మతాలు మరచి అందరం ఏకతాటిపైకి వచ్చి రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు హైకోర్టు విభజనను అడ్డుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికలు పూర్తికాగానే హైకోర్టు విభజన జరుగుతుందని నాకు నమ్మకం ఉందన్నారు. న్యాయవ్యవస్థలో తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం జరిగిందని, ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు జరగలేదని, పాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 31 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నామని కేటీఆర్ అన్నారు. తండాలను కూడా గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నామని, గిరిజనులు అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టామని తెలిపారు. సత్వర న్యాయం కోసం న్యాయవ్యవస్థలోనూ కొన్ని మార్పులు తీసుకొస్తామని తెలిపారు. వచ్చే జనవరిలో మన హైకోర్టు మనకు వస్తుందన్నారు. 1956 నుంచి 2014 వరకు ఒక్క రంగారెడ్డి జిల్లా మాత్రమే ఏర్పడిందని అన్నారు. సీఎం కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేకనే విపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయని కేటీఆర్ విమర్శించారు. దేశంలో ఎన్నో ఉద్యమాలను అణచివేశామని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నాడని, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తదని జైరాం రమేశ్‌కు సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. హైకోర్టు విభజన జరగకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం అని ఆరోపించారు. తనపై ఎలాంటి విచారణ వచ్చినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం చంద్రబాబుకు అలవాటు అని కేటీఆర్ విమర్శించారు. కొత్త జిల్లాల్లో డిస్టిక్ట్ర్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, న్యాయవ్యవస్థలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ వివరించారు.
హైకోర్టు విభజనను.. చంద్రబాబు అడ్డుకున్నారు




