Friday, 6 November 2026

హైకోర్టు విభజన దిశగా వడివడి అడుగులు

0z3x6hnzహైకోర్టు విభజన దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. హైకోర్టు విభజన కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం కేంద్రానికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వ న్యాయ కార్యదర్శి సంతోష్ రెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడను కలిశారు. హైకోర్టు విభజనపై అసెంబ్లీ తీర్మానం ప్రతిని ఆయనకు అందజేశారు. సత్వరమే హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ నేతలు రాజేందర్ రెడ్డి, మోహన్ రావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌ కేంద్రానికి రాసిన లేఖను ఎంపీలు కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడకు అందించారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 31 ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 214 ఆధారంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఏపీలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న హైకోర్టును తక్షణమే విభజించాలని… అందుకు అవసరమైన భవనాలను సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న భవనాన్ని ఏపీ హైకోర్టు నిర్వహణ కోసం వినియోగించుకోవచ్చునని తెలిపారు. తెలంగాణ హైకోర్టు నిర్వహణ కోసం గచ్చిబౌలిలో అన్ని వసతులతో కూడిన బహుళ అంతస్తుల భవనాన్ని పరిశీలించామని… అక్కడ హైకోర్టు నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని సీఎం కేసీఆర్‌ లేఖలో తెలిపారు.

రాష్ట్ర ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. హైకోర్టు విభజనకు కేంద్రం సుముఖంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ రాష్ట్ర ఎంపీలకు హామీ ఇచ్చారు. హైకోర్టు విభజన పోరాటం ఇప్పటికి సఫలమయిందని ఎంపీ కవిత అన్నారు. ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ ప్రభుత్వం సూచించిన భవనానికి కేంద్ర మంత్రి ఆమోదం తెలపడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి హైకోర్టు ఏర్పాటు అవుతుందని ఎంపీ వినోద్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉద్యమ స్ఫూర్తితో న్యాయవాదులు హైకోర్టు విభజన కోసం పోరాడుతున్నరని ఎంపీలు బీబీ పాటిల్, ప్రొఫెసర్ సీతారాం నాయక్ అన్నారు. ప్రత్యేక హైకోర్టు కోసం సీఎం కేసీఆర్ ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నరని ఎంపీలు చెప్పారు.హైకోర్టు విభజనకు వెంటనే చర్యలు ప్రారంభిస్తానని సదానంద గౌడ హామీ ఇచ్చినట్టు బార్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు. ఏపీ సీఎం, హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖలు రాస్తానని కూడా చెప్పారన్నారు.

హైకోర్టు విభజనకు సీఎం కేసీఆర్‌ చూపుతున్న చొరవ అభినందనీయమని న్యాయవాదులు ప్రశంసించారు. అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి చేరడంతో, విభజన ప్రక్రియ ఊపందుకుంటుందన్న భరోసా కలిగిందని లాయర్లు అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *