Wednesday, 4 November 2026

హైదరాబాద్‌లో ‘స్వైన్’ విహారం

హైదరాబాద్‌లో ‘స్వైన్’ విహారం, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. ఈ సారి చిన్నారులపై కూడా తన ప్రతాపాన్ని చూపుతోంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని వివిధఆస్పత్రుల్లో సుమారు 60 మంది చికిత్స పొందుతున్నట్లు స్వయంగా వైద్యులే అంగీకరిస్తున్నారు. గాంధీలో 19 పాజిటివ్, మరో 13 అనుమానిత కేసులుండగా, ఉస్మానియా ఆస్పత్రిలో ఓ హౌస్ సర్జన్ సహా ఎనిమిది మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

గ్రేటర్ పరిధిలోని కేర్, అపోలో, రెయిన్‌బో, కిమ్స్, కామినేని, ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి, అంకుర్, నారాయణ మల్టీస్పెషాలిటీ, ఆర్మీ ఆస్పత్రి, హోలిస్టిక్, ఆదిత్య, రెయిన్‌బో, యశోద, తదితర ఆస్పత్రుల్లో మరో 20 మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో పది మంది చిన్నారులుండగా, మరో 10 మంది మహిళలున్నారు. రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో గాంధీ స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రంలో పడకల సంఖ్య 20 నుంచి తాజాగా 35కు పెంచారు. గతేడాది డిసెంబర్‌లో నగరంలో 39 కేసులు న మోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. ఈ ఏడాది కేవలం 18 రోజుల్లో 146 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతంతో పోలిస్తే గత రెండేళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదైన దాఖలాలు లేవు.

భయం గుప్పిట్లో నర్సులు, మెడికోలు…
జనసమూహంలో సంచరించిన వృద్ధులు, గర్భిణులు, చిన్నారులే కాదు, బాధితులు చికిత్స పొందుతున్న ప్రదేశాల్లో పని చేస్తున్న వైద్యవిద్యార్థులకు, నర్సింగ్ సిబ్బందికి కూడా ఫ్లూ భయం పట్టుకుంది. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సులు, పారామెడికల్‌స్టాఫ్, ల్యాబ్ టెక్నిషియన్లు ఈ జ్వరం బారిన పడగా, తాజాగా ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి చెందిన ఓ హౌస్‌సర్జన్ సైతం స్వైన్‌ఫ్లూతో పోరాడుతుండటమే ఇందుకు నిదర్శనం. ఆస్పత్రి సిబ్బందికి ముందస్తు స్వైన్‌ఫ్లూ నిరోధక వాక్సిన్ ఇవ్వక పోవడమే ఇందుకు కారణం. డ్రంకన్ డ్రైవ్‌లో పాల్గొనే సిబ్బంది కూడా ఈ వైరస్ ఎక్కడ తమను చుట్టుకుంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *