11వ వేతన ఒప్పందం 50 శాతం ప్రకటించాలి.
– టీన్టీయూసీ ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్.
బెల్లంపల్లి, నవంబర్ 28, (జనంసాక్షి )
సింగరేణిలో 11 వ వేతన ఒప్పందం 50 శాతానికి పెంచాలని టీన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణిరామ్ అన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ వేజ్ బోర్డు కనీసం 50 శాతం పెరుగుదల కు జెబిసిసిఐ జాతీయ సంఘాలు సింగరేణి యాజమాన్యం, కోలిండియాపై ఒత్తిడి పెంచాలని వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రైవేటీకరణను, కాంట్రాక్టీకరణలను సింగరేణిలో ఎత్తివేయాలని, సింగరేణి కార్మికులకు ఆదాయం పన్ను మినహాయించాలని, అలవెన్సులపై పన్ను, సిఐఎల్ మాదిరిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణ, కార్పోరేటికరణ, కొత్త కార్మిక చట్టాలను, లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని అన్నారు. పదిలక్షలపై సవరించిన గ్రాడ్యుటీ ప్రకారం పెండింగ్ బకాయిలు చెల్లించాలని, 2016 జనవరి నుండి అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఒకటవ క్యాటగిరి వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని, సింగరేణి ఓసీపీలో, అండర్ గ్రౌండ్ మైన్స్ లో బొగ్గు ఉత్పత్తి చేసే పనిని ప్రైవేటు కాంట్రాక్టర్కు ఇచ్చే పద్ధతిని మానుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు సొంత ఇంటి పథకం తో పాటు, జిల్లా కేంద్రంలో 250 గజాల స్థలంతో పాటు, రూ 50 లక్షలు వడ్డీ లేని రుణం సదుపాయం కల్పించాలన్నారు. ఎస్ఆర్పి మూడవ గని ప్రమాదంలో మరణించిన కృష్ణారెడ్డి, సత్యనారాయణ రాజుల వారసులకు బేషరతుగా ఉద్యోగాలు ఇవ్వాలని దీనికి అన్ని సంఘాలు కృషి చేయాలన్నారు. పెసర కుంట వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన సింగరేణి రెస్క్యూ కార్మికులకు రెండు కోట్ల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సింగరేణిలో 15 అండర్ గ్రౌండ్ మై న్స్ బొగ్గు గనులు తెరిపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తాం అన్న హామీలను నెరవేర్చాలన్నారు. సింగరేణిలో పదవి విరమణ చేసిన కార్మికులకు అదే రోజు అన్ని పరిమినల్ బెనిఫిట్స్ అందజేయాలన్నారు. సింగరేణిలో 1985లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు టిడిపి ప్రభుత్వ హయాంలో ఒక్క నయా పైసా తీసుకోకుండా 30 వేల నిరుద్యోగులకు పరుగు పందెం ద్వారా ఉద్యోగాలను అందించిన ఘనత టిడిపి దే అన్నారు. 1998లో సింగరేణి బిఐఎఫ్ఆర్ లోకి వెళితే 1263 కోట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పుగా తీసుకువచ్చి, అందులో 663 కోట్ల రూపాయల రుణం మాఫీ చేయించి, సింగరేణిని లాభాల బాటలోకి తీసుకువచ్చింది మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. సింగరేణిలో మొట్టమొదటిసారిగా లాభాల వాటా పది శాతం ఇచ్చిన ఘనత కూడా టిడిపి నారా చంద్రబాబు నాయుడు దే అని, మళ్లీ టిఎన్టియుసిని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలిపిస్తే సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ నుండి రక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈసమావేశంలో టీన్టీయూసీ ఉపాధ్యక్షుడు జి నారాయణ, నాయకులు బుల్లు మల్లయ్య, సదానందం, హరి కిషన్ పాండే, గంగాధర్ గౌడ్, మధునయ్య, కాసర్ల వెంకటేష్, ఎండి హాసన్, వెంబడి రాములు పాల్గొన్నారు.
11వ వేతన ఒప్పందం 50 శాతం ప్రకటించాలి.




