బెల్లంపల్లి, ఏప్రిల్ 29, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని స్టేషన్ రోడ్డు కాలనీలో శనివారం సింగరేణి సివిక్ కార్యాలయం వద్ద కాంట్రాక్టు కార్మికులు మేడే పోస్టర్ విడుదల చేశారు. ఈసందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి చాంధ్ పాషా మాట్లాడుతూసూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా తమపై అత్యంత దారుణంగా సాగుతున్న శ్రమదోపిడికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని దినం కోసం అమెరికన్ కార్మిక వర్గం పోరాడింది. మార్కెట్ కేంద్రంగా జరిగిన కార్మిక ప్రదర్శనలో కొందరిని పోలీసులు కాల్చి చంపారు, కొందరిని ఉరి తీశారు, 8 గంటల పని దినంకై పోరాడిన విప్లవ యోధులు అందరికీ ఐఎఫ్టియు విప్లవ జోహార్లు అర్పిస్తుందన్నారు. చికాగో అమరవీరుల త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచం నలుమూలల కార్మిక వర్గ హక్కులకై అనేక పోరాటాలు జరిగాయి. అనేక హక్కులు సౌకర్యాలు సాధించుకున్నారు. ఈ పోరాటాలలో భాగంగానే తలోగ్గిన నాటి నుండి నేటి వరకు ఉన్నటువంటి పాలకవర్గాలు కార్మికులకు చట్టాలు రూపొందించాయి. కానీ చట్టబద్ధమైన ఆ హక్కులు కల్పించడానికి పాలకవర్గాలు ఏనాడు పూనుకోలేదు. చట్టబద్ధహక్కులు కూడా అమలు చేయాలని కార్మిక వర్గం నిరంతర పోరాటాలు చేస్తూనే ఉన్నది. దేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ కార్మిక వర్గ చట్టాలను హక్కులను పరిరక్షించడంలో అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. జాతీయత, దేశభక్తి కోసం మాట్లాడే నేడు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్ కోట్లకు కుదించింది. కార్మికులను తమ అవసరం కోసం వాడుకునే బానిసల కింద దిగజార్చి కార్పోరేట్ల కాళ్ల కింద బానిసలుగా చేసింది. జాతీయ పరిశ్రమల అన్నింటిని ఆదాని, అంబానీ లాంటి బడా కార్పోరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నది. హక్కుల కోసము సౌకర్యాల కోసము తను అనుసరించే పాసిస్టు విధానాలను అణిచివేతను ఎదిరించి మాట్లాడే గొంతులను అనిచివేస్తున్నది. ప్రైవేటీకరణ విధానాలను శరవేగంగా అమలు చేస్తూ, ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులతో నింపి వేస్తున్నది. నామమాత్రపు వేతనంతో, బానిసలుగా పని చేయించుకుంటున్నది. రాష్ట్రంలోని టిఆర్ఎస్, (బిఆర్ఎస్) అరి చేతిలో వైకుంఠం చూపిస్తూ అనేక హామీలను ఇచ్చింది. ఆ హామీలను నెరవేర్చకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలు, రైతులు, కార్మికుల సమస్యలపై పోరాడుతున్న సంఘాలను నాయకులను అణిచివేస్తూ తన పాలనను కొనసాగిస్తున్నది. కేంద్రం చేపట్టిన ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలకు పిలుపునిచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణలోని ఏకైక పెద్ద పరిశ్రమ సింగరేణిలో అమలు జరుగుతున్న కాంట్రాక్టీకరణను ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ద్వంద విధానాలను అనుసరిస్తున్నది. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ విస్మరించారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంలో, కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల పర్మినెంట్ సమస్యను గాలికి వదిలేసింది. పై డిమాండ్ల కోసం పోరాడుతున్న విప్లవ కార్మిక సంఘాలను వాటికి నాయకత్వం వహిస్తున్న నాయకులను అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కార్మిక వర్గానికి మరింత బలమైన కార్మికోద్యమాన్ని నిర్మించడం తప్ప మరో గత్యంతరం లేదు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో, దేశంలో కార్మిక వర్గం కోసం పోరాడి అమరులైన వారి త్యాగాలతో మరింత బలమైన కార్మికో ఉద్యమాన్ని నిర్మించాల్సి ఉంది. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు హక్కులు సౌకర్యాలతో పాటు నేడున్న పరిస్థితుల్లో ఇంకా అనేక చట్టబద్ధమైన హక్కులు సాధించుకోవడానికి చికాగో మృతవీరుల స్ఫూర్తితో బలమైన కార్మిక వర్గ పోరాటాలు నిర్మించి ఉద్యమించడమే చికాగో అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డివిజన్ నాయకులు , భాను, సునీత, సురేష్, పోసక్క, చంద్రకళ, అమృత, వెంకటేశ్వర్లు రాజేశ్వరి, కమల, దేవమ్మ, తదితరులు పాల్గొన్నారు




