హైదరాబాద్ : పేద ప్రజల దవాఖాన నిమ్స్‌కు మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిమ్స్‌ను భారీగా విస్తరించాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా త్వరలోనే నిమ్స్ విస్తరణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. గురువారం నాంపల్లిలోని ఏరియా దవాఖానను సందర్శించి డయాలసిస్ కేంద్రం, బ్లడ్‌బ్యాంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 33 ఎకరాల్లో నిమ్స్ విస్తరణ పనులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. 2 వేల పడకల సామర్ధ్యంతో కొత్తగా మూడు బ్లాకులు నిర్మించనున్నట్టు చెప్పారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాక్‌లు ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. గచ్చిబౌలి, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్‌లో నిర్మించనున్న టిమ్స్‌తోపాటు వరంగల్ హెల్త్‌సిటీ నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు నాలుగు టిమ్స్ దవాఖానలు, నిమ్స్ విస్తరణ చేపట్టారని.. దీంతో మరో ఆరువేల పడకలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ట్రామా కేర్ సెంటర్లను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేస్తామని తెలిపారు.
1,571 కోట్లతో నిమ్స్ విస్తరణ.. వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన: మంత్రి హరీశ్




