నిజామాబాద్ ఎంపి కవిత
హైదరాబాద్,మే24(జనం సాక్షి): వచ్చేనెలలో పసుపు రైతుకలు వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎంపి కవిత ఆధ్వర్యంలో దీనిని చేపట్టారు. పసుపు రైతులను ఆదుకోవడానికి నిజామాబాద్ ఎంపీ కవిత చేస్తున్న కృషి కార్యరూపం దాల్చుతోంది. నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తున్న ఆమె.. రైతులకు పసుపు పంటలో మెళకువలు నేర్పేందుకు వర్క్ షాప్‌ను నిర్వహించనున్నారు. రాష్ట్రప్రభుత్వం, స్పైస్‌బోర్డు జాయింట్ ఆర్గనైజ్ చేయనున్న ఈ వర్క్ షాప్ జూన్ 18న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోలని ఎంపీ కవితను ఆమె నివాసంలో కలిసిన బోర్డు ప్రతినిధులు.. వర్క్ షాప్ గురించి చర్చలు జరిపారు. పసుపు పంట సాగులో మెళకువలు, పంట నిల్వ, మార్కెటింగ్ సౌకర్యాలు ఇతర దేశాలకు ఎగుమతి తదితర అంశాలపై వర్క్‌షాప్‌లో చర్చించనున్నారు. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూరు పడగల్‌లో ఏర్పాటవుతున్న స్పైస్ పార్క్‌లో ప్రత్యేక టర్మెరిక్ సెల్ ఏర్పాటుతో పాటు పార్క్‌లో మౌలిక సదుపాయాలు కల్పనపై సర్కార్ దృష్టి పెట్టనుంది. వర్క్‌షాప్‌లో పసుపు రైతులు, పసుపు ఎగుమతిదారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో పాటు.. ఫిక్కీ ప్రతినిధులు పాల్గొననున్నారు. అదేవిధంగా నిజామాబాద్, మహబూబాబాద్, కేసముద్రం, మహారాష్ట్రలోని సంగ్లీ, తమిళనాడులోని ఈరోడ్, సేలం, కేరళలోని ఆలెప్పీ మార్కెట్ చైర్మన్లు కూడా హాజరు కానున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక టర్మెరిక్ సెల్ ద్వారా పసుపు రైతులకు నాణ్యమైన పసుపు వంగడాలు, ప్రాసెసింగ్‌కు అవసరమైన బాయిలర్ వంటి ఎక్విప్‌మెంట్ సమకూరనున్నాయి. అదే విధంగా రైతులకు సలహాలు, సూచనలను ఇచ్చేందుకు శాస్త్రవేత్తలు ఎప్పుడూ అందుబాటులో ఉండనున్నారు. పంట క్రాప్ వచ్చిన తర్వాత పసుపుని నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణాలను చేపట్టనున్నారు
18న పసుపురైతులకు వర్క్‌షాప్




