– ప్రధాని నాయకత్వంలో దేశంలో అభివృద్ధి జరుగుతుంది
– చంద్రబాబు ఎంతమందిని పోగేసినా ఏవిూకాదు
– కడప స్టీల్ ప్లాంట్‌కు సరైన సమాచారం ఇవ్వలేదు
– పైగా బీజేపీపై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారు
– వచ్చే 20ఏళ్లలో ఐదు ఇండస్ట్రీరియల్ కారిడార్లు రాబోతున్నాయి
– ఇరిగేషన్ ప్రాజెక్టులతో చంద్రబాబు బినావిూలు దోచుకుంటున్నారు
– విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు
తిరుపతి, నవంబర్2(జనంసాక్షి) : ఇప్పటికే తెలంగాణలో కనుమరుగైన టీడీపీ పార్టీ.. త్వరలో ఏపీలోనూ కనుమరుగు అవుతుందని, 2019 ఎన్నికలు టీడీపీకి ఆఖరి ఎన్నికలు కాబోతున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్
నర్సింహారావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుతో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా, ఎన్ని కూటములు పెట్టినా దేశంలో బీజేపీకి వచ్చిన నష్టం ఏవిూలేదని, ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధికి దేశ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీతో కలిసిన పార్టీలన్నీ భూస్థాపితం అవుతాయని, టీడీపీ కూడా భూస్థాపితం కావడం ఖాయమన్నారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వలేదని, కేవలం అవగాహనా రాహిత్యంగా బీజేపీపై బురదజల్లే దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. దోలెరా నగరం ఏవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందో, అదేవిధంగా చిత్తూరులో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ త్వరలో రాబోతుందని తెలిపారు. చెన్నై-కోల్‌కత్తా ఇండస్టీ కారిడార్ రావడం వల్ల ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో ఐదు ఇండస్టియ్రల్ కారిడార్లు ఏపీ రాబోతున్నాయని జీవీఎల్ తెలిపారు. దేశాన్ని రక్షిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారని, కానీ దాని అర్ధం తెలుగు దేశాన్ని రక్షిస్తానని చెప్పడమేనని ప్రజలు ఈ విషయం గమనించాలని అన్నారు. చంద్రబాబు చేస్తున్న హడావిడి అంతా కాపాడటానికి కాదని దేశాన్ని కూల్చడానికేనని తీవ్రంగా విమర్శించారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాలను అభివృద్ధి చేయడంలో చంద్రబాబు విఫలం చెందారని ఆరోపించారు. తన సొంత జిల్లాలో అభివృద్ధి చేయలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు చిత్తూరు జిల్లాలో సాగునీరు, తాగునీరు కూడా ఇవ్వలేదని వెల్లడించారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను చంద్రబాబు తన బినావిూలకు అప్పజెప్పారని జీవీఎల్ ఆరోపించారు. రాయలసీమలో ప్రాంతాల్లో ఏమాత్రం అభివృద్ధి జరగడం లేదని ధ్వజమెత్తారు. గురువారం ఢిల్లీలో యూటర్న్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీలో చేసిన రాజకీయాల వల్ల దేశంలో ఎటువంటి మార్పు రాదని గ్రహించాలని హితవుపలికారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో అభివృద్ధి జరుగుతోందని వ్యాఖ్యానించారు. యూపీఏ కూటమి అవినీతి కూటమి, అప్రజాస్వామిక కూటమి, ఈ కూటమిలో చేరిన పార్టీలు భూస్థాపితం అవుతాయని జోస్యం చెప్పారు. 20రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీని ఏ కూటములు ఏవిూ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయాయని జీవీఎల్ పేర్కొన్నారు.
2019 తర్వాత.. టీడీపీ కనుమరుగు ఖాయం




